మీడియాలో వాతావరణ సూచనలు, గ్రహఫలాలు, బంగారం వెండి ధరల వార్తల మాదిరిగానే ప్రతీరోజూ వైసీపీ నాయకుల కేసులు, విచారణలు, అరెస్టులు, ముందస్తు బెయిల్ పిటిషన్ల వార్తలు కూడా భాగమైపోయాయి. ఈరోజు వార్తలలోమాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు పోలీసులు నాలుగోసారి నోటీస్ జారీ చేసిన వార్త, వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి హైకోర్టులో ముందస్తు బెయిల్ నిరాకరించిన వార్తలు వచ్చాయి. కనుక వీటికి కొనసాగింపు వార్తలు రేపు తప్పక వస్తాయి.
అయితే వైసీపీ నేతలపై ఇన్ని కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నా, వల్లభనేని వంశీ వంటి కొందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా ఇంతవరకు సాధించింది ఏమిటి? అంటే ఏమీ లేదనే చెప్పుకోవాలి. పోలీసుల విచారణ, కోర్టు వ్యవహారాలు అంత త్వరగా ముగిసేవి కావు.
కనుక ఈ కేసులలో ఎటువంటి పురోగతి లేదని సరిపెట్టుకున్నా, ఓ పక్క పోలీసులు నోటీసులు పంపించి, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వైసీపీ నేతలను వెతికి పట్టుకొచ్చి విచారణ జరిపి, రిమాండ్‌పై లోనికి పంపేలోగా, లోపలున్నవారు బెయిల్‌పై బయటకు వచ్చేస్తూనే ఉన్నారు కదా? అలా వచ్చేసినవారు కేవలం రాజకీయ కక్షతోనే తమని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకి పంపింది తప్ప నేరం నిరూపించలేకపోయిందని స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు కదా?
అక్కడితో ఆ కేసు ముగిసిపోయిన్నట్లే అని అందరూ భావించడం పరిపాటిగా మారింది. ఆ తర్వాత ఈ కేసు గురించి మీడియాలో కూడా వార్తలు రావడం ఆగిపోతాయి.
ఉదాహరణకు కాకినడాలో దళిత యువకుడి హత్య కేసు, చంద్రబాబు నాయుడు ఇంటిపై మాజీ మంత్రి జోగి రమేష్ తదితరులు దాడి కేసు, పేర్ని గోదాముల నుంచి రేషన్ బియ్యం మాయం కేసు, కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా కేసులు కనిపిస్తూనే ఉన్నాయి.
ఈ 10 నెలల్లో ఇలాంటివి మరో రెండు మూడు డజన్ల కేసులు నమోదయ్యాయి. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో.. ఏం జరుగుతోందో ఎవరికీ తెలీదు.
అంటే అవినీతి, అక్రమాలు, ఆరాచకాలకు, హత్యలకు పాల్పడినవారు కొన్ని రోజులు జైల్లో ఉంది బెయిల్‌పై బయటకు వచ్చేస్తే వారు చేసిన నేరాలకు శిక్ష విధించేసినట్లేనా?వారు కడిగిన ఆణిముత్యాలుగా మారిపోతారా?
కేసులు నమోదుతో మొదలైన ప్రక్రియ బెయిల్‌తో ముగిసిపోతుంటే ఈ మాత్రం దానికి ఇంత హడావుడి, వృధా ప్రయాస, ప్రజాధనం వృధా చేయడం అవసరమా?అనిపించక మానదు.




