నెల్లూరు వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి ఘటనని మంత్రి నారా లోకేష్ ఖండించారు. కానీ ఆయన అడిగిన ఓ ప్రశ్న మహిళల పట్ల వైసీపీ నేతల ధోరణిని గుర్తుచేస్తుంది.
“మహిళా ఎమ్మెల్యేవేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఉద్దేశించి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. వైసీపీ అధినేత జగన్ తల్లిని, చెల్లిని తరిమిస్తే వైసీపీ నేతలు ఆయనని ఆదర్శంగా తీసుకొని ఫాలో అయిపోతున్నారు. వైసీపీలో ఎవరికీ మహిళల పట్ల గౌరవం లేదా?” అని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు.
యధారాజా తధాప్రజా అన్నట్లు వైసీపీ అధినేత జగన్ సొంత తల్లిని, చెల్లిని బయటకు గెంటేశారు. శాసనసభలో తన ఎమ్మెల్యేల చేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి గురించి చాలా అసభ్యంగా మాట్లాడుతుంటే జగన్ పైశాచికానందంతో చిర్నవ్వులు నవ్వారు.
పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుపెట్టుకుంటున్నారనే అక్కసుతో ‘మూడు పెళ్ళాలు’ అంటూ మహిళల గురించి చాలా చులకనగా మాట్లాడారు. రాజధాని కోసం భూములిచ్చిన మహిళా రైతులను వేశ్యాలన్నట్లు తన సాక్షి ఛానల్లో చెప్పించారు.
ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు కనుక వైసీపీ నేతలు కూడా గంటా, అరగంటా అంటూ రెచ్చిపోతుండేవారు. ప్రజలు చూస్తారనే భయం కూడా లేకుండా శాసనసభ, మీడియా, బహిరంగ సభలు, రోడ్ షోలలో వైసీపీ నేతలు యధేచ్చగా బూతులు మాట్లాడేవారు. పోసాని కృష్ణమురళి, కొడాలి నాని, అంబటి రాంబాబు వంటివారు ఎంతగా రెచ్చిపోయారో అందరికీ తెలుసు.
కనుక వైసీపీ అధినేత జగన్ మొదలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వరకు ప్రతీ ఒక్కరికీ మహిళల పట్ల చులకన భావం ఉందనే విషయం ఈవిదంగా ఏదో ఓ సందర్భంలో స్వయంగా వారే బయటపెట్టుకుంటున్నారు కదా?
కానీ నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరిస్తున్నట్లు జగన్ తల్లిని, చెల్లిని, మరో చెల్లెలు (వివేకా కూతురు)ని ముప్పతిప్పలు పెడుతూనే అదే నోటితో నా అక్కలు, చెల్లెమ్మలు, నా అవ్వలు, నా నాన్నమ్మలు అంటూ సన్నాయి రాగాలు తీస్తుంటారు. ఇంట్లో వాళ్ళని గౌరవించని వ్యక్తులు బయట మహిళలను గౌరవిస్తారని ఆశించలేము కనుక గౌరవిస్తున్నట్లు నటిస్తున్నారు అంతే!




