కొండ నాలుక్కి మందేస్తే…

YS Jagan Grama Volunteerజగనన్న మానస పుత్రికలు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థలు. మొదటి పుత్రిక ముచ్చట్లు ఇది వరకే చెప్పుకొన్నాము. ఇప్పుడు రెండో పుత్రిక ముచ్చట్లు చెప్పుకొనే సమయం వచ్చింది.

వైసీపీ కార్యకర్తలకు నేరుగా ప్రభుత్వం నెలనెలా డబ్బు చెల్లిస్తే న్యాయపరమైన చిక్కులు ఏర్పడుతాయి కనుక పెద్ద కూతురు ద్వారా చిన్న కూతురికి సంబందం కలిపి జీతాలు చెల్లిస్తోంది. కనుక వారిని పూర్తిగా వాడుకోవాలనుకోవడం అత్యాశ కాదు.

ADVERTISEMENT

వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలను నేరుగా ప్రజలకు అందజేస్తూ ఓట్లు పక్కదారి పట్టకుండా కాపాడుకోవాలనే దూరదృష్టి కూడా ఉందని చెప్పక తప్పదు. గత మూడేళ్ళుగా ఈ కార్యక్రమాలు చాలా దివ్యంగా సాగిపోతుండటంతో వైసీపీ ప్రభుత్వం ఇటీవలే సక్సస్ మీట్ పెట్టి వాలంటీర్లకు బోనస్ అంటే నగదు కానుకలు కూడా ముట్టజెప్పింది.

ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ మనం ఒకటి తలిస్తే ప్రభువు మరొకటి తలుస్తాడన్నట్లు, జగనన్న ఒకటనుకొంటే మరొకటి జరిగింది.

ఇంతవరకు ఎన్నికల సమయంలో తప్ప పెద్దగా ప్రజల మొహాలు చూడని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన గడప గడపకు కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు గోత్రనామాలు చెప్పుకొని పరిచయం చేసుకోవలసి వస్తోంది. ప్రజలు కూడా వారిని గుర్తు పట్టడానికి కాస్త ఇబ్బంది పడుతున్నారు. కనుక ఇంతకాలం నియోజక వర్గాలలో ప్రజలతో కలిసి ఉంటూ వారికి సంక్షేమ పధకాలు అందిస్తున్న వాలంటీర్లను వెంటబెట్టుకొని వెళ్లవలసి వస్తోంది.

ఇప్పుడు ఇది కూడా ఓ పెద్ద సమస్యగా మారింది. ప్రజలు వాలంటీర్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. వాలంటీర్లతో ఎంతో సౌమ్యంగా మాట్లాడే ప్రజలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చూడగానే ఏదో పూనకం వచ్చినట్లు ఊగిపోతూ “మా రోడ్లు ఎప్పుడు వేయిస్తారు? మాకు ఇళ్ళు ఎందుకు ఇవ్వడం లేదు?పింఛన్ల సంగతేమిటి?” అంటూ నిలదీస్తున్నారు. “వాలంటీర్లకు చెప్పుకొంటే ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో కానీ మీకు చెప్పుకొని ఏం ప్రయోజనం?” అన్నట్లు మాట్లాడుతున్నారు.

దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. వాలంటీర్లతో వైసీపీకి మేలు కలుగుతుందనుకొంటే, వారికే ప్రజాధారణ, గుర్తింపు లభిస్తుండటంతో కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లవుతోంది. వాలంటీర్లకే ప్రజాధారణ ఎక్కువగా ఉంది కనుక చివరికి వచ్చే ఎన్నికలలో జగనన్న వారికే టికెట్లు ఇస్తే మేలేమో? కాస్త ఆలోచించవలసిన విషయమే!

ADVERTISEMENT
Latest Stories