ఏపీ మద్యం కుంభకోణం కేసులో కర్త, ఖర్మ, క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డే అని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి స్వయంగా బయటపెట్టారు.
అప్పటికే ఈ కేసు దర్యాప్తు మొదలుపెట్టిన ఏపీ సీఐడీ పోలీసులు, ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారిగా భావిస్తున్న ఏపీ బీసీఎల్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి ద్వారా చాలా కీలక సమాచారం సేకరించారు. కనుక కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి విచారణ-నోటీస్ ఇచ్చారు. కానీ అరెస్ట్ భయంతో ఆయన హైకోర్టుని ఆశ్రయించగా ఎదురుదెబ్బ తగిలింది. కనుక సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది.
ఇదే కేసులో మరో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి పేరు కూడా వినబడుతుండటంతో ఆయన ముందే హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. కానీ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో వేశారు.
ఇన్ని రోజులుగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున మిధున్ రెడ్డి ఆ వంకతో తప్పించుకున్నారు. కానీ ఇప్పుడు ఏపీ సీఐడీ పోలీసులు తన కోసం ఢిల్లీ వచ్చి గాలిస్తున్నారని తెలియగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.
తమకు ప్రజలు, రాష్ట్రం, తమ పార్టీ, అధినేత జగనే ముఖ్యమని వారి కోసం జైలుకి వెళ్ళేందుకు కూడా సిద్దమని ప్రెస్‌మీట్లు పెట్టి పదేపదే చెప్పిన వైసీపీ నేతలు, విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు ఇచ్చే నోటీసులు తీసుకునేందుకు కూడా భయపడుతుండటం, నోటీసులు అందుకోక మునుపే ముందస్తు బెయిల్ పిటిషన్లు వేస్తుండటం చూస్తే వారి మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుందని అర్దమవుతుంది.
నాడు జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుతో సహ టీడీపీ ముఖ్య నేతలందరికీ నోటీసులు ఇస్తున్నప్పుడు, కేసులు నమోదు చేస్తున్నప్పుడు, అరెస్టులు చేస్తున్నప్పుడు వైసీపీ నేతలు, వారి సొంత మీడియా కుట్రలుగా భావించలేదు. కానీ ఇప్పుడు అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాల కేసులలో వైసీపీ నేతలకు నోటీసులు ఇవ్వడం కూడా కుట్రే అని వితండవాదం చేస్తున్నాయి. అంతే తాము చేస్తే సంసారం ఎదుట వాళ్ళు చేస్తే వ్యభిచారం అన్న మాట!
ఏది ఏమైనప్పటికీ ఏపీ సీఐడీ పోలీసులు ఈ మద్యం కుంభకోణం కేసు ఒక్కటి ఛేదించగలిగితే వైసీపీలో చాలా మంది నేతలు లోపలకు వెళ్ళాల్సి వస్తుంది.




