
ఐదేళ్ళ జగన్ పాలనలో భూకబ్జాలను రెండు రకాలుగా సాగాయి. 1. అధికారిక కబ్జాలు. 2.అనధికార కబ్జాలు. అధికారిక కబ్జాలంటే రాష్ట్ర ప్రభుత్వం జీవోలు జారీ చేసి లేదా మరో విధంగా వైసీపి కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములు కేటాయించేసుకోవడం.
అనధికార కబ్జాలంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపి నేతల వేల ఎకరాల భూకబ్జాలు. ఇంకా ఇసుక, మట్టి, కంకర, మైనింగ్ వగైరాల కోసం కొండలు, గుట్టలు, చెరువులు, కాలువలు కబ్జా చేసి దోచుకున్నవి కూడా ఈ కోవలోకే వస్తాయి.
Also Read – తెలంగాణలో మొదలైన ‘రిజర్వేషన్ల’ లొల్లి..!
మళ్ళీ తామే ఎన్నికలలో గెలిచి అధికారంలో వస్తామని, ఎప్పటికీ తామే అధికారంలో ఉంటామనే ధీమాతోనే జగన్ ప్రభుత్వం, వైసీపి నేతలు ఇంతగా రెచ్చిపోయారని చెప్పవచ్చు. కానీ వారి లెక్క తప్పడంతో ఇప్పుడు వారి ఈ కబ్జాల భాగోతాలన్నీ బయటపడుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఒక్కో జిల్లాలో 1-2 రెండు ఎకరాల చొప్పున 26 జిల్లాలలో కలిపి మొత్తం 42.44 ఎకరాలు వైసీపి కార్యాలయాలకు కేటాయించేసుకుంది జగన్ ప్రభుత్వం.
Also Read – అయ్యో పాపం ఆమాద్మీ… ఇలా కూడానా?
వాటిలో ఒక్క ప్రకాశం జిల్లాలో నిర్మించిన కార్యాలయానికి తప్ప మరి వేటికీ అనుమతులు తీసుకోలేదు. కోట్ల రూపాయలు విలువచేసే ఆ భూములకు ఏడాదికి రూ.1,000 మాత్రమే అద్దెగా నిర్ణయించేసి 33 ఏళ్ళకు లీజుకి ఇచ్చేసింది జగన్ ప్రభుత్వం.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ఇదేనేమో?ఇంత దూరదృష్టి ఉన్న జగన్-వైసీపి నేతలకు ఒకవేళ ఎన్నికలలో ఓడిపోయి అధికారం కోల్పోతే, అప్పుడు ఈ భాగోతాలన్నీ బయటపడితే తమ పరిస్థితి ఏమిటని ఆలోచించలేదా?అని ఎవరికైనా సందేహం కలుగుతుంది. కానీ దానికీ తరుణోపాయం ఉంది కనుకనే బరి తెగించారు.
Also Read – ఐసీయూ లో ఉన్న వైసీపీకి చిరు ఊతమిస్తే…టీడీపీ ఊపిరి తీసింది.!
అంత పెద్ద ఋషికొండని పరదాలు కప్పి దాచేయగలమనుకున్న జగన్, వైసీపి నేతలు, ఈ భాగోతాలు బయటపడితే ఎలా సమర్ధించుకోవాలో తెలీదనుకుంటే అంతకంటే అవివేకం మరొకటి ఉండదు.
తమ భూభాగోతాలు ‘రాజకీయ కక్ష సాధింపు’ అనే వాదనతో దాచిపెట్టేసి, తిరిగి టిడిపి ప్రభుత్వంపైనే ఎదురుదాడి కూడా చేయగలరని తాడేపల్లి వైసీపి కార్యాలయం కూల్చివేత సందర్భంగా స్పష్టమైంది.
అయితే వైసీపి ఎదురుదాడి, దుష్ప్రచారానికి టిడిపి ప్రభుత్వం భయపడి వైసీపి కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకోకుండా ప్రతి విమర్శలు, ఆరోపణలు చేస్తూ కాలక్షేపం చేస్తే, అవినీతి, అక్రమాలకు పాల్పడినా ఎటువంటి శిక్ష లేకుండా తప్పించుకోవచ్చనే తప్పుడు సంకేతం పంపినట్లవుతుంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మెతక వైఖరితో వ్యవహరిస్తే సామాన్య ప్రజలు తీవ్ర అసంతృప్తి చెందుతారని మరిచిపోకూడదు.