ప్రతీ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం పనితీరుపై ప్రజలు భిన్నాభిప్రాయాలు కలిగి ఉండటం చాలా సహజం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం పనితీరుపై రాష్ట్రంలో దాదాపు అన్ని వర్గాల ప్రజలు చాలా అసహనంగా ఉన్నారు. అని టిడిపి, జనసేన లేదా మరో ప్రతిపక్ష పార్టీయో చెపుతోంది కనుక నిజమని భావించనవసరం లేదు. అలాగే మీడియా చెపుతోంది కనుక నమ్మనవసరం లేదు. కానీ సామాన్య ప్రజల మద్య నిత్యం జరిగే సంభాషణలు, చర్చలలో ప్రభుత్వ పనితీరు పట్ల తీవ్ర అసహనం, ఆగ్రహం వినిపిస్తోంది. కనుక ఇది నిజమని నమ్మక తప్పదు.
ఏరికోరి ఎన్నుకొన్న జగనన్న ప్రభుత్వం పట్ల కేవలం మూడేళ్ళలోనే ప్రజలలో ఎందుకు వ్యతిరేకత ఏర్పడింది? రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేసి సంక్షేమ పధకాలకు చెల్లిస్తున్నా ప్రజలు ఎందుకు అసహనంగా ఉన్నారు?అనే సందేహం కలుగుతుంది. దీనికి అనేక కారణాలున్నాయి. అవి అందరికీ తెలుసు. వాటన్నిటినీ క్లుప్తంగా ఒకే ముక్కలో చెప్పుకోవాలంటే ప్రజల ఆకాంక్షలను అర్ధం చేసుకోకుండా పరిపాలన సాగిస్తుండటమే అని చెప్పుకోవచ్చు.
అయితే రాష్ట్ర ప్రజలు తమ ప్రభుత్వానికి బ్రహ్మరధం పడుతున్నారని గట్టిగా నమ్ముతూ ఆత్మవంచన చేసుకొంటున్న వైసీపీ నేతలు దీనిని అంగీకరించడం లేదు కానీ తమ ప్రభుత్వం పట్ల ప్రజలలో నానాటికీ వ్యతిరేకత పెరుగుతోందనే విషయం వారి మాటలలోనే స్పష్టమవుతోంది.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో బుదవారం వైసీపీ జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశం జరిగింది. దీనిలో ప్రసంగించిన వైసీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య మాటలు వింటే ఇది అర్ధం అవుతుంది.
ఇంతకీ ఆయన ఏమన్నారంటే, “వచ్చే శాసనసభ ఎన్నికలు ఆషామాషీగా ఉండవు. వాటిలో మనం గెలవడం అంతా సులువేమీ కాదు. ఆ ఎన్నికలలో గెలిచేందుకు ఇప్పటి నుంచే మనమందరం కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో జనాభా నానాటికీ పెరుగుతోంది. దాంతో బాటే ప్రజల గొంతెమ్మ కోర్కెలు కూడా పెరిగిపోతున్నాయి. వాటన్నిటినీ తీర్చడం ఎవరితరం కాదు. కనుక క్షేత్రస్థాయిలో నాయకులు నిత్యం ప్రజల మద్య ఉంటూ మన ప్రభుత్వం పట్ల వారికి నమ్మకం కలిగించాలి. ఒకవేళ రాష్ట్రంలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాకపోతే ఆంధ్రప్రదేశ్ అధోగతే అని ప్రజలకు నచ్చచెప్పాలి. ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షమే లేదు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండటం చాలా అవసరం,” అని అన్నారు.
రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షమే లేదని చెపుతున్నప్పుడు మరి వచ్చే ఎన్నికలలో వైసీపీ అవలీలగా గెలుస్తుందని చెప్పుకోవాలి కానీ వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలవడం అంత సులువు కాదని ఎందుకు చెపుతున్నట్లు?అంటే రాష్ట్రంలో టిడిపి బలపడుతోందని వైసీపీ గ్రహించిందని అర్ధమవుతోంది.
అదేవిదంగా సంక్షేమ పధకాలతో ఓటర్లను సంతృప్తిపరచలేకపోతున్నామని కనుక వాటితో ఓట్లు రాలకపోవచ్చునని, తమ ప్రభుత్వం పట్ల ప్రజలు ఎంతో కొంత అసంతృప్తి, అసహనంగా ఉన్నారని వైసీపీ గ్రహించిందని అర్దమవుతూనే ఉంది. అయినా రాష్ట్రంలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాకపోతే ఆంధ్రప్రదేశ్ అధోగతే అని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?



