విధేయత చాటుకున్నాం… ఇక మీదే భారం సార్!

YSRCP Supports NDA Candidate For Lok Sabha Speaker

ఊహించిన్నట్లే 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్డీయేకు చెందిన ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఆయనపై పోటీగా ఇండియా కూటమి కె సురేష్‌ని నిలబెట్టినప్పటికీ, ఓం బిర్లా ఎన్నికయినట్లు ప్రోటెం స్పీకర్‌ మహతాబ్ ప్రకటించగానే అధికార, విపక్షాలు ఆయనకు అభినందనలు తెలిపాయి. ఈ సందర్భంగా రెండు ముఖ్య విషయాలు చెప్పుకోవలసి ఉంటుంది.

లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఇండియా కూటమి కూడా పోటీ పడి ఓడిపోయినప్పటికీ, రాహుల్ గాంధీతో సహా కూటమి సభ్యులు అందరూ స్పీకర్‌ ఓం బిర్లాని అభినందించి, ఆయనను తోడ్కొని వెళ్ళి కుర్చీలో కూర్చోపెట్టి సభాపతిని గౌరవించారు.

ADVERTISEMENT

కానీ ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడుని సభ్యులు ఎన్నుకుంటున్నప్పుడు జగన్మోహన్‌ రెడ్డి ఆ కార్యక్రమానికి హాజరుకాకుండా పులివెందుల వెళ్ళిపోయారు!

సభాపతి పట్ల కనీస గౌరవం చూపకపోయినా, తనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలని కోరుతూ మళ్ళీ ఆయనకే జగన్మోహన్‌ రెడ్డి లేఖ వ్రాయడం విశేషం. లోక్‌సభలో రాహుల్ గాంధీ చూపిన హుందాతనం ఏపీ శాసనసభలో జగన్మోహన్‌ రెడ్డి చూపలేకపోయారు.

రెండో విషయం ఏమిటంటే, ఎన్డీయే కూటమిలో టిడిపి, జనసేనలు ఇప్పుడు భాగస్వాములుగా ఉన్నాయి. కనుక స్పీకర్‌ ఎన్నికలో ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు ఇవ్వడం సహజమే.

కానీ వైసీపి ఇటు ఎన్డీయేలో, అటు ఇండియా కూటమి దేనిలోనూ భాగస్వామి కాదు. కానీ లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికలో వైసీపి ఎంపీలు ఎన్డీయేకు మద్దతు ఇచ్చారు!

అంటే చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లు ఎన్డీయేలో ఉన్నప్పటికీ, తాను మోడీ, అమిత్ షాలకు ఎప్పటిలాగే వీర విధేయుడినే అని జగన్‌ చెప్పుకున్నట్లు భావించవచ్చు.

ఎందుకంటే రాష్ట్రంలో వైసీపి అధికారం కోల్పోవడంతో, అక్రమాస్తుల కేసులతో సహా అనేక ఇతర కేసులు కూడా జగన్‌ మెడకు ఉచ్చులా బిగుసుకునే అవకాశం ఉంది. వాటిలో ఏదో ఓ కేసులో జగన్‌తో సహా వైసీపి నేతలు జైళ్ళకు పంపడం అనివార్యంగానే కనిపిస్తోంది.

ఈ విషయం జగన్మోహన్‌ రెడ్డికి బాగా తెలుసు అందుకే అడగకుండానే ఎన్డీయేకి మద్దతు ఇచ్చి మోడీకి తన విధేయతని తెలియపరిచారని భావించవచ్చు. మరి ఈ విధేయతకు మెచ్చి ప్రధాని నరేంద్రమోడీ జగన్మోహన్‌ రెడ్డికి ఈ కేసుల నుంచి ఉపశమనం కల్పిస్తారా? చంద్రబాబు నాయుడు నుంచి రక్షణ కల్పిస్తారా? కల్పిస్తే చంద్రబాబు నాయుడు అంగీకరిస్తారా?

ADVERTISEMENT
Latest Stories