సినిమాలతో అధికారంలోకి రాగలిగితే, నిలబెట్టుకోగలిగితే…

Telugu Political Films

సినిమాలు నటీనటులకు మంచి పేరు ప్రతిష్టలు, అభిమానులను సంపాదించి పెడతాయి. ఆ అభిమానం ఇంకా పెరిగితే వారు రాజకీయాలలో కూడా రాణించే అవకాశం ఉంటుందని స్వర్గీయ ఎంజీ రామచంద్రన్, జయలలిత, ఎన్టీఆర్‌ నిరూపించి చూపారు.

కానీ కొన్నిసార్లు ఫలించకపోవచ్చని చిరంజీవి ప్రజారాజ్యం చెపుతోంది. కానీ సినిమాల కోసం శ్రమించినట్లే, రాజకీయాలలో కూడా శ్రమిస్తే ప్రజలు తప్పక ఆదరిస్తారని జనసేనతో అర్దమవుతోంది. అంటే సినిమాలైనా, రాజకీయాలైనా శ్రమించక తప్పదని, అర్దమవుతోంది.

ADVERTISEMENT

సినిమాలలో కధతో సహా ఇంకా చాలా అంశాలు బాగుంటేనే సూపర్ హిట్ అవుతుంది లేకుంటే ఎంత దంచినా ప్రయోజనం ఉండదు. అలాగే రాజకీయాలలో కూడా కృషి, పట్టుదలతో పాటు ప్రజల పట్ల, రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఎంతో నిబద్దత ఉంటే గానీ రాణించలేరని అందరికీ తెలుసు.

రాణించలేకపోతునప్పుడు, ప్రజలలో తమ పొలిటికల్ గ్రాఫ్ పడిపోతున్నప్పుడు చివరి ప్రయత్నంగా తమని తాము ప్రమోట్ చేసుకుంటూ సినిమాలు తీసి జనాల మీదకు వదులుతుంటారు. వాటిని తమ కోణంలో నుంచి ప్రజలకు చూపించి, తాము కడిగిన ఆణి ముత్యాలమని, తమ ప్రత్యర్ధులు దుష్టులు, దుర్మార్గులని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు.

సాధారణంగా ఎన్నికలకు ముందు ఇటువంటి పెయిడ్ బయో ఫిక్స్ పేరుతో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఇదివరకు లక్ష్మీస్ ఎన్టీఆర్‌, యాత్ర, తాజాగా యాత్ర-2, వ్యూహం సినిమాలు ఆ కోవకు చెందినవే అని చెప్పవచ్చు.

అయితే తమ పాలనతో, రాష్ట్రాభివృద్ధితో, నైతిక విలువలతో కూడిన రాజకీయాలతో ప్రజలను మెప్పించాల్సిన అధికార పార్టీ, సినిమాలతో జనాలను మెప్పించాలనుకోవడమే తొలి ఓటమి కదా?దానిని చూసి ప్రజలు నమ్మేసి మళ్ళీ తమ పార్టీకే ఓట్లు వేసేసి గెలిపించేస్తారని అనుకోవడం భ్రమ, అవివేకమే కదా?

ఒకవేళ సినిమాలు చూసి ప్రజలు రాజకీయ పార్టీలను గెలిపించేస్తారనుకుంటే, సినీ పరిశ్రమ నుంచి రాజకీయాలలోకి వచ్చిన ఎన్టీఆర్‌ మొదలు నేడు ఇండస్ట్రీతో బలమైన సంబంధాలు కలిగిన చంద్రబాబు నాయుడు వరకు టిడిపి నేతలు కూడా సినిమాలు తీసేవారే కదా?

టిడిపికి అవకాశం ఉన్నప్పటికీ అటువంటి ప్రయత్నం చేయలేదు. వైసీపికి ఆ అవసరం ఉంది గాబట్టి తీస్తూనే ఉంది. ప్రతిపక్షాలు తమపై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించే వైసీపి, ‘వ్యూహం’తో చేస్తున్నది ఏమిటి? టిడిపి, జనసేనలను ఎన్నికలలో దెబ్బ తీసేందుకు కుట్రే కదా?

హైకోర్టు అర్దం చేసుకున్న ఈ విషయాన్ని ప్రజలు అర్దం చేసుకోలేరని వైసీపి అనుకుంటే అది ప్రజల విచక్షణ జ్ఞానం, రాజకీయ చైతన్యం పట్ల చులకనభావం ఉన్నందునే అని చెప్పక తప్పదు.

అయినా తిరుగులేని మెజారిటీతో ప్రజలు అధికారం కట్టబెట్టినప్పుడు, ఆ ‘ఒక్క ఛాన్స్’ని సద్వినియోగం చేసుకుంటూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చక్కగా రాష్ట్రాన్ని పాలించి ఉంటే నేడు ‘వ్యూహం సిద్ధం’ అంటూ ఇలా తిప్పలు పడాల్సిన అవసరమే ఉండేది కాదు కదా?

ADVERTISEMENT
Latest Stories