మూడు రాజధానులు అంటూనే వైసీపీ నిండా మునిగింది అన్న సంగతి వైసీపీ నేతలు ఇప్పటికి గ్రహించలేకపోతున్నారు. అమరావతి ముంపు ప్రాంతం, అమరావతి కమ్మరావతి, ఇది రాష్ట్ర రాజధాని కాదు స్మశానం…ఈ ప్రచారాలే వైసీపీ ని రాజకీయంగా నిండా ముంచేసాయి అన్న సంగతి వైసీపీ అధినేత సైతం ఒప్పుకోలేకున్నారు.
అధినేత బాటలోనే నాయకులు అన్న చందంగా వైసీపీ బడా నాయకుల నుంచి చోటామోటా నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు అందరు నాటి నుంచి నేటి వరకు రాజధాని అమరావతి పై విషం చిమ్ముతూనే ఉన్నారు.
అమరావతి మునిగిపోయింది, అమరావతికి వరదలు, నదులను మరిపిస్తున్న నవ నగరాలు, చెరువులను తలపిస్తున్న నిర్మాణాలు అంటూ అవే అవహేళనలు, అవే వెక్కిరింపు వ్యాఖ్యలు. ఒక రాష్ట్ర రాజధాని పై ఈ రకంగా విషం చిమ్మే ప్రతిపక్షం ఒక్క ఏపీకే సాధ్యం అనేలా వైసీపీ అమరావతి రాజకీయంతో మునిగిపోతుంది.
గత రెండు మూడు రోజుల నుంచి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు వరద ముంపుకి గురయ్యాయి. కొన్ని కొన్ని ప్రాంతాలలో వర్షాల కారణంగా స్కూల్ ళ్ళకు, కాలేజ్ లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. అటు తెలంగాణ, చెన్నై లలో సైతం వర్షాలు ఆయా రాజధానులను ముంచేసాయి.
కానీ ఏ రాష్ట్రంలోనూ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు తమ రాష్ట్రం పై తమ రాష్ట్ర రాజధాని పై వైసీపీ మాదిరి నీచ రాజకీయానికి పాల్పడడం లేదు. భారీ వర్షాలతో ఏపీలోని రాజధాని అమరావతి లో సైతం నీరు చేరింది. అయితే ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు కేతిరెడ్డి అమరావతిలో పులస చేప పట్టి తెస్తా అంటూ వెటకారంతో కూడిన విమర్శలు చేస్తున్నారు.
ఇన్నాళ్ళుగా ఎంతో విలువైన పులస చేప ఒక్క గోదావరి జిల్లాకు మాత్రమే పరిమితమయ్యింది, ఇకనుంచి రాష్ట్ర రాజధాని అమరావతిలో సైతం ఈ పులస చేపను పట్టుకునే అవకాశం వచ్చిందంటూ అమరావతిలో చేరిన వరద నీటిని ఉద్దేశించి వ్యంగ్యంగా విమర్శించారు కేతిరెడ్డి.
దీనితో ఇప్పటికి రాజధాని విషయంలో వైసీపీ బుద్ది మారలేదు అనేది స్పష్టమయిపోయింది. 2024 ఎన్నికలలో జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి తోడు ల్యాండ్ టైట్లింగ్ ఆక్ట్ వైసీపీ పతనాన్ని ఏవిధంగా అయితే నిర్దేశించాయో ఇప్పుడు రాజధాని పై వైసీపీ కక్కుతున్న నీలి విషం రానున్న ఎన్నికలలో వైసీపీ పతనానికి పునాదులు తవ్వుతున్నాయనేది వైసీపీ నాయకులు గ్రహించే లోపే వైసీపీ కి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.






