జగన్ సర్కార్ అధికారం ఎక్కిన నాటి నుండి టీటీడీ తీసుకునే నిర్ణయాలు నిత్యం వివాదాస్పదంగా మారుతున్నాయి. ముఖ్యంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, భక్తుల సౌకర్యాలను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించడం చర్చనీయాంశమవుతోంది.
ఇప్పటికే దర్శన టికెట్ల వ్యవహారంలో గతంలో ఉన్న యాప్ ఫెసిలిటీని తీసేసి భక్తులకు టికెట్లు దొరకకుండా చేస్తోందంటూ టీటీడీ తీరుపై భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అలాగే దర్శనాల విషయంలో గతంలో తమకున్న సౌలభ్యాలను, లడ్డులను కూడా తీసేసారని టీటీడీ ఉద్యోగులు కూడా గగ్గోలు పెడుతున్నారు.
ఏదొక కారణంతో వార్తల్లో నిలుస్తోన్న టీటీడీ వ్యవహారంలో తాజాగా తిరుమలలో జరిగే అన్న ప్రసాద వితరణ అంశం హైలైట్ అయ్యింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవన్ లో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోగా, వాటిపై కొండపై ఉన్న వ్యాపారస్తులు మండిపడుతున్నారు.
తిరుమలలో కేవలం స్వామి అన్న ప్రసాదం మాత్రమే ఉండాలని, ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ హోటల్స్ ను పూర్తిగా తీసివేసేలా నిర్ణయం తీసుకున్నారు. దీనికి టీటీడీ చైర్మన్ ఇచ్చి వివరణ ఏమిటంటే… సామాన్యుల నుండి ప్రముఖుల వరకు అందరికి ఒకటే ఆహారం ఇస్తారట. ఈ అన్న ప్రసాదం ఉచితంగానే అందజేస్తారట.
అన్న ప్రసాదాన్ని ఓ చేత్తో ఉచితంగా అందజేస్తూ, మరో చేత్తో సేవల టికెట్ల ధరలను పెంచి భక్తుల నుండి డబ్బులను రాబట్టే విధంగా టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలు విమర్శలకు దారి తీస్తున్నాయి. ఇటీవల సేవల టికెట్ ధరల పెంపుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాలు ఏవో స్వామి వారి దర్శనం విషయంలో అమలు చేస్తే మిక్కిలి సంతోషంగా ఉంటుంది అంటున్నారు భక్తులు.
ప్రముఖులు వచ్చినపుడు స్వామి వారికి అత్యంత చేరువగా తీసుకువెళ్లి పూజలు అందించడం ఆనవాయితీ. అదే సామాన్యులకు అయితే స్వామి వారిని అల్లంత దూరాన దర్శించుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా అందరికి ఒకే విధమైన దర్శనం అమలు చేయొచ్చు కదా, సామాన్యులకు కూడా స్వామి వారి దివ్య రూప దర్శనం కన్నులవిందుగా మారుతుంది అంటున్నారు భక్తులు.
ప్రస్తుతం కొండపై ఎన్నో హోటల్స్ ఉన్నాయి. ప్రజల అభీష్టం మేరకు ఎవరికి కావాల్సింది వారు భుజిస్తున్నారు. స్వామి వారి ప్రసాదం తీసుకున్న తర్వాత కూడా బయట హోటల్స్ లో తమకు కావాల్సిన ఆహారాన్ని సాధారణంగానే తీసుకుంటుంటారు. ఇప్పుడు భక్తులకు ఆ సౌకర్యాన్ని లేకుండా చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
దీని వలన ఇబ్బందుల పాలయ్యేది ఒక్క భక్తులే కాదు, హోటల్స్ నే ఉపాధిగా మార్చుకుని కొన్ని వందల మంది జీవిస్తున్నారు. నిజంగా హోటల్స్ ద్వారా భక్తులను దోచుకుంటున్నారని భావిస్తే, పూర్తిగా నిషేధించే కన్నా జగన్ తీసుకున్న సినిమా టికెట్ల ధరల మాదిరి హోటల్స్ మెనూ ధరలలో కూడా నియంత్రణ తీసుకువస్తే సబబుగా ఉండేదేమో!
ప్రస్తుత పాలక మండలి తీసుకుంటున్న నిర్ణయాలు చూసి “గోవిందా గోవిందా” అని అనుకోవడం తప్ప భక్తులు చేయగలిగింది ఏమీ లేదు. దర్శనం టికెట్ల విషయంలో టీటీడీ పాలక మండలి సభ్యులు పంచుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తుండడంతో… అసలు వీరి చిత్తశుద్ధి ఏ పాటిదో ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది.



