‘బాహుబలి: ది కన్ క్లూజన్’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కావడంతో, థియేటర్ల వద్ద సినీ అభిమానులు బారులు తీరారు. ఈ సినిమా టికెట్ల కోసం హైదరాబాద్ లోని ఐమాక్స్ ధియేటర్ వద్ద సినీ ప్రేక్షకులు కిలోమీటర్ల కొద్దీ నిల్చుని ఉండడం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. హైదరాబాద్ హుసేన్ సాగర్ తీరంలోని ఐమాక్స్ టికెట్ కౌంటర్ నుంచి ప్రారంభమైన క్యూ మింట్ కాంపౌండ్ వరకూ సాగింది. అభిమానుల మధ్య తొక్కిసలాట జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అలాగే నగరంలోని పీవీఆర్, ఐనాక్స్ తదితర మల్టీప్లెక్సులతో పాటు సత్యం, రామకృష్ణ, దేవి, సుదర్శన్ వంటి సింగల్ థియేటర్ల వద్ద కూడా అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. అలాగే ఏపీలోని ప్రముఖ పట్టణాలైన విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి వరంగల్ తదితర ప్రాంతాల్లోనూ ఇదే విధమైన సందడి నెలకొంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా “బాహుబలి 2” ఫీవరే తాండవిస్తోంది. సామాన్య జనాలే కాదు, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు కూడా ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
యంగ్ హీరో మంచు మనోజ్ కూడా ఈ సినిమా చూడ్డానికి ఉవ్విళ్లూరుతున్నాడు. అంతేకాదు, ఈ సినిమాను చూడ్డానికి మనోజ్ కు అతని డైరెక్టర్ సెలవు కూడా ఇచ్చాడట. ఈ విషయాన్ని మంచు మనోజ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపాడు. ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే’ విషయాన్ని మేమిద్దరం కలసి తెలుసుకోవడానికి, మా డైరెక్టర్ అజయ నూతక్కి ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా షూటింగ్ క్యాన్సిల్ చేశాడని చెప్పాడు. ఒక్క మంచు మనోజ్ పరిస్థితి మాత్రమే కాదు, ఇండస్ట్రీలోని చాలామంది మాట కూడా ఇవే!



