ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోందని ఎవరైనా ప్రశ్నిస్తే రాజకీయాలు, కక్ష సాధింపులు, సంక్షేమ పధకాలు, వాటి కోసం అప్పులు అని చెప్పుకోవచ్చు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావుపై కక్ష కట్టిన జగన్ సర్కార్ రెండు వారాలు తిరక్కుండానే మళ్ళీ సస్పెండ్ చేసింది. 1969 ఆలిండియా సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకంగా వ్యవహరించారంటూ, ఆయనను మళ్ళీ సస్పెండ్ చేస్తూ మంగళవారం రాత్రి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
2018, అక్టోబరులో జగన్ సర్కార్ ఆయనను సస్పెండ్ చేసినప్పుడు ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళి రెండేళ్ళపాటు న్యాయపోరాటం చేసి తన ఉద్యోగం కాపాడుకొన్నారు. ఆయనను తక్షణం విధులలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఈ నెల 14వ తేదీన అంతగా ప్రాధ్యాన్యం లేని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమీషనర్‌గా ఆయనను నియమించింది. కానీ రెండు వారాలు తిరిగేసరికి ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేయడం కక్షసాధింపే అని అర్ధమవుతోంది.
దీనిపై ఆయన స్పందిస్తూ, “గతంలో 3-1 సెక్షన్ కింద నాపై విధించిన సస్పెన్షన్ చెల్లదంటూ సుప్రీంకోర్టు కొట్టివేసింది. మళ్ళీ ఇప్పుడు 3-3 సెక్షన్ కింద నన్ను ఏవిదంగా సస్పెండ్ చేసిందో అర్ధం కాదు. నాపై క్రిమినల్ కేసులున్నాయని సాక్షిలో అబద్దపు కధనాలు ప్రసారం చేస్తోంది. వాటిని నేను ఖండిస్తున్నాను. సిఎం జగన్మోహన్ రెడ్డి మీదే 12 సిబిఐ ఛార్జ్ షీట్లు, ఐఏఎస్ అధికారిని శ్రీలక్షిపైన కూడా ఉన్నాయి. వారికి వర్తించని రూల్స్ నాకు మాత్రమే ఎలా వర్తిస్తాయి. నేను అవినీతికి పాల్పడ్డానని ఏసిబి అధికారులు తప్పుడు ఆరోపణలు చేశారు. కానీ ఇంతవరకు వాటిని నిరూపించలేకపోయారు. మరి అటువంటప్పుడు నాపై క్రిమినల్ కేసులున్నాయని ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు?
కోడి కత్తి ఘటనలో రాష్ట్రంలో అల్లర్లు జరుగబోతున్నాయని గ్రహించి అవి జరుగకుండా అడ్డుకొన్నాను. అప్పటి నుంచే జగన్ ప్రభుత్వం నాపై కక్ష కట్టి ఈవిదంగా వేధిస్తోంది. అయితే నేను వీటికి భయపడేది లేదు. మళ్ళీ న్యాయపోరాటం చేస్తాను. నా ఉద్యోగం నేను కాపాడుకొంటాను. ప్రభుత్వంలో భాగమైన ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను ప్రభుత్వమే ఈవిదంగా వేదిస్తుంటే ఇక నిష్పక్షపాతంగా ఎలా పనిచేయగలం?సిఎం జగన్మోహన్ రెడ్డికి భయపడి కొంతమంది ఉన్నతాధికారులు నాకు వ్యతిరేకంగా చట్టవిరుద్దంగా వ్యవహరిస్తున్నారు. వారందరూ మూల్యం చెల్లించుకోక తప్పదు,” అని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.



