బాబూ మోహన్ టిడిపిలోకి… దేనికి సంకేతం?

Babu Mohan

ప్రముఖ హాస్య నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ టిడిపి సభ్యత్వం తీసుకొని మళ్ళీ సొంత గూటికి చేరుకున్నారు. ఆయన తెలంగాణలో ఆందోల్ నియోజకవర్గానికి చెందినవారు, ప్రాతినిధ్యం వహించేవారు కనుక అక్కడి నుంచే టిడిపి సభ్యత్వం తీసుకున్నారు.

బాబూ మోహన్ 1998లో టిడిపితో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి బిఆర్ఎస్, బీజేపీ, ప్రజాశాంతి పార్టీలు మారి మళ్ళీ టిడిపికి చేరుకున్నారు. కానీ ఇప్పుడు చర్చ ఆయన సినీ, రాజకీయ ప్రస్థానం గురించి కాదు. తెలంగాణలో టిడిపి పునరుత్తానం గురించి!

ADVERTISEMENT

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో జరిగిన రాజకీయాల గురించి అందరికీ తెలుసు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి అవడంతో తెలంగాణ టిడిపిపై పూర్తిగా దృష్టిపెట్టలేకపోయారు. అందువల్ల టిడిపి మరింత వేగంగా బలహీనపడింది.

కానీ ‘తెలంగాణ సెంటిమెంట్‌’ రాజేస్తూ కేసీఆర్‌ రాజకీయాలు చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు టిడిపిని బలోపేతం చేయడానికి కృషి చేసి ఉంటే రెండు రాష్ట్రాల మద్య అగ్నిజ్వాలలు రగిలి ఉండేవి. కనుక అప్పుడు చంద్రబాబు నాయుడు వెనక్కు తగ్గడం సరైన నిర్ణయమే అని భావించవచ్చు.

అదేవిదంగా తెలంగాణ శాసనసభ ఎన్నికలలో టిడిపి పోటీ చేయకపోవడం చాలా గొప్ప నిర్ణయమని ఫలితాలు చూసిన తర్వాత అందరూ అంగీకరించారు.

టిడిపి ఉంటేనే కేసీఆర్‌ తెలంగాణ సెంటిమెంట్‌ రాజేసుకోగలిగేవారు. కనుక టిడిపిని బలహీనపరిచి దెబ్బ తీసి పెద్ద తప్పిదం చేశానని బహుశః కేసీఆర్‌కి అప్పుడే అర్దమై ఉంటుంది. ఆ ఎన్నికలలో ఫలితాలను తారుమారు చేయడంతో తెలంగాణలో టిడిపి క్యాడర్, పార్టీ ప్రభావం ఇంకా బలంగానే ఉందని నిరూపితమైంది.

బిఆర్ఎస్ పార్టీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోవడంతో కేసీఆర్‌ అస్త్ర సన్యాసం చేసిన్నట్లు ఫామ్‌హౌస్‌లో ఉండిపోయారు.

ఈ నేపధ్యంలో బిఆర్ఎస్ పార్టీని వీడాలనుకునేవారికి కాంగ్రెస్‌ మొదటి ఆప్షన్ అని వేరే చెప్పక్కరలేదు. కానీ ఆ పార్టీ అధికారంలో ఉంది కనుక ఇప్పుడు దానిలో ఖాళీలేదు. చేరినా పదవులు, ప్రాధాన్యత లభిస్తాయనే నమ్మకం లేదు. రెండో ఆప్షన్ మత రాజకీయాలు చేసి బీజేపీ. కానీ దానిలో ఇమడటం చాలా కష్టం.

కనుక తెలంగాణలో ఇప్పుడు టిడిపికి అనూకూల రాజకీయ వాతారణం ఏర్పడిందని చంద్రబాబు నాయుడు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆ రాష్ట్రంలో టిడిపిని మళ్ళీ బలోపేతం చేయాలనుకుంటున్నారు. ఆయన ఈ మాట చెప్పిన తర్వాత టిడిపి నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన సీనియర్ నేతలందరికీ ఆహ్వానం పలికిన్నట్లే భావించవచ్చు.

వారిలో కొందరు ఇప్పటికే టిడిపితో టచ్‌లోకి వచ్చారు. వారిలో బాబూ మోహన్ ‘ఎర్లీ బర్డ్ ఆఫర్’ కోసం ముందుగా వచ్చేశారనుకోవచ్చు. బహుశః రాబోయే రోజుల్లో మరింత మంది టిడిపిలో చేరవచ్చు. అంటే బాబు మోహన్ చేరిక తెలంగాణ టిడిపి మళ్ళీ బలపడబోతోందనే తొలి సంకేతంగా భావించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories