ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా సాగుతోంది. ఓ పక్కన మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో యాక్షన్ ఎంటర్టైనర్ ను సిద్దం చేస్తుండగా, ఈ సినిమా పూర్తి కాగానే ‘భరత్ అనే నేను’ సినిమాలో ఏకంగా ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్నాడన్న టాక్ సెన్సేషన్ గా మారింది. యాక్షన్, పొలిటికల్ థ్రిల్లర్ వంటి రెండు జోనర్స్ తర్వాత, ప్రిన్స్ కెరీర్ లో 25వ సినిమాకు దర్శకత్వం వహించే అరుదైన అవకాశాన్ని వంశీ పైడిపల్లి సొంతం చేసుకున్నాడు.
అయితే తాజా ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాకు మరింత వినూత్నంగా సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఎంతగా అంటే కామెడీ హీరో అల్లరి నరేష్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించే విధంగా! అల్లరి నరేష్ సిల్వర్ స్క్రీన్ పై ఎంత కామెడీ చేస్తాడో, అంతకుమించిన నటుడు అన్న విషయం ‘నేను, ప్రాణం, శంభోశివశంభో’ వంటి పలు చిత్రాలు నిరూపించాయి. దీంతో మహేష్ సినిమాలో అల్లరి నరేష్ కామెడీ చేయబోతున్నాడా? లేక ఓ అద్భుతమైన రోల్ తో మెస్మరైజ్ చేయబోతున్నాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమా సెప్టెంబర్ లేక అక్టోబర్ లో ప్రారంభం కాబోతుందని ఇటీవల వంశీనే స్వయంగా ప్రకటించారు. దీంతో ప్రిన్స్ నేతృత్వంలో మరో మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతుందని స్పష్టమవుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది గానీ, సమాచారం మాత్రం పక్కా అంటున్నారు ట్రేడ్ వర్గీయులు. దిల్ రాజు – అశ్వనీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను నింపాదిగా జరుపుకుంటోంది. ‘ఊపిరి’ సినిమా తర్వాత మరో సినిమా జోలికి వెళ్ళకుండా ఇదే స్క్రిప్ట్ పై వంశీ పైడిపల్లి కూర్చోవడం విశేషం.



