బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రధాని మోడీని, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని ఎంతగా ద్వేషిస్తారో రెండు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. అయితే వారి ఆ ద్వేష భావనలే తెలంగాణకు, చివరికి వారి పార్టీకి కూడా తీరని నష్టం కలిగిస్తున్నయనే విషయం వారికీ తెలుసు.
అయితే ఆ ద్వేషానికి ‘తెలంగాణ కోసం కొట్లాట’ అనే అందమైన ముసుగు వేశారు. ఆ కొట్లాటలతో ప్రజలలో తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయంగా పైచేయి సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీ చేయని ప్రయత్నం లేదు.
అంటే తమ ద్వేష భావనలతో రాష్ట్రానికి నష్టం కలిగినా పార్టీకి రాజకీయంగా ప్రయోజనం కలుగుతోందని వారు దానిని తమ పార్టీ విధానంగా మార్చేసుకున్నారు. ఈ కారణంగానే కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినా తెలంగాణకు ఒక్క విమానాశ్రయం సాధించుకోలేకపోయారు. అనిపించవచ్చు.
వరంగల్ విమానాశ్రయం ఏర్పాటుకి అదనంగా మరో 400 ఎకరాలు సేకరించి ఇవ్వాలని కోరినా కేసీఆర్ పట్టించుకోలేదని నేడు పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పడమే ఇందుకు నిదర్శనం.
సిఎం రేవంత్ రెడ్డి మాత్రం కంకణం కట్టుకున్నట్లు భూసేకరణ చేసి అప్పగించి విమానాశ్రయం నిర్మాణం కోసం పట్టుబడుతున్నారని చెప్పారు.
ఆయన కోరినట్లుగానే మరో మూడు వారాలలో పనులు మొదలుపెట్టి 2028, జూన్ 2 (తెలంగాణ అవతరణ దినోత్సవం) నాటికి వరంగల్ విమానాశ్రయం నిర్మాణ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తాము. ఆలోగా ఆదిలాబాద్ విమానాశ్రయం కొరకు మేము అడిగిన భూమి అందిస్తే దాని పనులు కూడా మొదలుపెడతాము,” అని రామ్మోహన్ నాయుడు చెప్పారు.
ఇక్కడ కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్, బిజేపిలు బద్ధ శత్రువులు. కనుక కాంగ్రెస్ సిఎంగా రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు ప్రధాని మోడీని, బిజేపిని విమర్శిస్తూనే ఉంటారు. రాజకీయంగా ప్రధాని మోడీ, రేవంత్ రెడ్డి విభేదించుకుంటున్నా ప్రభుత్వాధినేతలుగా పరస్పరం గౌరవించుకుంటారు. సఖ్యతగా ఉంటారు. కనుక కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తూనే ఉంది. అలా సహకరించేలా రేవంత్ రెడ్డి జాగ్రత్తగా మేసులుకున్తున్నారు.
కానీ కేసీఆర్‌కి తన అహం కంటే ఏదీ ముఖ్యం కాదు. కనుక ప్రధాని మోడీని పదేపదే అవమానించారు. అలాగే టీడీపిని నిర్వీర్యం చేశారు. సిఎం చంద్రబాబు నాయుడుని అమితంగా ద్వేషిస్తూ ఒకసారి గద్దె దించడానికి పరోక్షంగా జగన్‌కి తోడ్పడ్డారు కూడా.
కానీ ఇప్పుడు అయన అమితంగాద్వేషించే ఆ ప్రధాని మోడీ, టీడీపికి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వల్లనే వరంగల్ విమానాశ్రయం ఏర్పాటు కాబోతోంది.
సిఎం చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటు చేయాలని తనపై ఒత్తిడి చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు చెప్పారు.
సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “నాడు కింజారపు ఎర్రంనాయుడుగారితో నాకున్న అనుబందం ఇప్పుడు తెలంగాణకు అక్కరకు వచ్చింది. అయన కుమారుడు రామ్మోహన్ నాయుడుగారు తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటుకి ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తున్నారు,” అని అన్నారు.
నలుగురిని కలుపుకుపోతే మేలు జరుగుతుంది అని ఏపీ, తెలంగాణ సిఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి నిరూపించి చూపుతుంటే, అందరితో కొట్లాడుతుంటే రాష్ట్రాలకి, పార్టీలకి కీడే జరుగుతుందని మాజీ సిఎంలు కేసీఆర్, జగన్ నిరూపించి చూపారు. కానీ వారి తీరు మారేలా లేదు.




