రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరి పట్ల ఇప్పటికే పూర్తి అసంతృప్తితో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి మొండిచేయి చూపించింది మోడీ సర్కార్. ఆర్ధిక మంత్రిగా అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని అంశాలు ఏపీ వర్గాలను పూర్తిగా నిరాశపరిచాయి. కేవలం నామమాత్రపు కేటాయింపులతో సరిపెట్టిన జైట్లీ, ఏపీకి దక్కాల్సిన కీలక విషయాలైన ‘ప్రత్యేక హోదా, అమరావతి నిర్మాణానికి నిధులు’ ప్రస్తావన తీసుకురాకపోవడం తెలుగుదేశం పార్టీ వర్గాలకు కూడా విస్మయాన్ని గురిచేసింది. ‘ఏ విషయంలోనైనా ఏపీకి అండగా నేనుంటాను’ అని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ మాటలు కేవలం పేపర్ కు మాత్రమే పరిమితమయ్యే అంశాల కనపడుతోందన్న విమర్శలకు ఊతమిచ్చేలా బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు దక్కాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
“జాతీయ ప్రాజెక్టు పోలవరానికి 100 కోట్లు కేటాయించగా, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు మరో 100 కోట్లు కేటాయించారు. ఇక సాగర నగరం, ఏపీ ఆర్ధిక రాజధానిగా పరిగణిస్తున్న విశాఖ మెట్రో రైలుకు కేవలం ఒక (1) లక్ష మాత్రమే కేటాయించి అందర్నీ అవాక్కు చేసారు. ఇక, ఐటీ, ఐఐటీ, ఎన్ఐటీలకు చేసిన ప్రతిపాదనలలో ట్రిపుల్ ఐటీలకు 20 కోట్లు, తిరుపతి ఐఐటీకి 40 కోట్లు, విశాఖ ఐఐఎంకు 30 కోట్లు, తాడేపల్లిగూడెం ఎన్ఐటీకి 40 కోట్లు, తిరుపతి ఐ.ఐ.ఎన్.సీ.ఆర్.కు 40 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయానికి ఒక కోటి నిధులు” మాత్రమే కేటాయించారు. దీంతో కేంద్ర సర్కార్ పై ఏపీ కేంద్రంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



