2019 వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైస్ జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పునాదులేసుకున్న అమరావతి సమాదయ్యింది. నాటి నుంచి 2024 ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకు అమరావతి ఎన్నో అవమానాలను, మరెన్నో రాజకీయ నిందలను మోస్తూ తన సమయం కోసం వేచి చూసింది.
ఇక 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర ఓటమితో పాటుగా కూటమి ఘన విజయంతో అమరావతి 2.0 రూపంతో అమరావతి రాజధానిగా తిరిగి పట్టాభిషేకం జరుపుకుంది. అయితే నాటి నుంచి నేటి వరకు కూడా రాజధాని స్థిరత్వానికి, అమరావతి నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది.
అలాగే అమరావతి అభివృద్ధికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం తో పాటుగా అటు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందించడంతో 2025 లో రాజధాని అభివృద్ధికి మార్గాలు సుగమమం అయ్యాయి. అయితే ఈ 2025 అమరావతి 2.0 రివ్యూ చూస్తే…
* రోడ్లు – కనెక్టివిటీ రహదారులు:
ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం కూటమి ప్రభుత్వం ముందుగా నడుం బిగించింది. అలాగే రాష్ట్రంలోని ప్రముఖ నగరాలతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమరావతికి కనెక్టివిటీ రహదారుల నిర్మాణం పై ద్రుష్టి సారించింది.
ఇందులో భాగంగా రాయపూడి నుంచి మూలపాడు వరకు సుమారు 5 కిమీ పొడవున కృష్ణా నది పై ఐకానిక్ 6 లైన్ కేబుల్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టింది, అలాగే ఈ ప్రాజెక్ట్ నిర్మాణ డిజైన్ ను సైతం ప్రజామోదంతో ఎంపిక చేసింది. ఇక హైద్రాబాద్ – అమరావతి ఎక్స్ ప్రెస్ వే నిర్మాణనికి, అలాగే రాజధాని కేంద్రంగా కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకి ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఇక విజయవాడ వెస్ట్ బైపాస్ భాగంగా గొల్లపూడి వద్ద NH-65 నుంచి అమరావతి N-13 రోడ్డుకి కనెక్టివిటీ రహదారిగా సుమారు 3 కిమీ పొడవునా కృష్ణ నది పై బాహుబలి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి దాదాపు పూర్తి చేసి పాక్షికంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో అమరావతి – విజయవాడ మధ్య 15 నుంచి 20 కిమీ ల దూరం తగ్గుతుంది, అలాగే సమయం కలిసొస్తుంది.
*ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలిజీ హబ్:
క్వాంటం వ్యాలీ వంటి టెక్నాలజీ ప్రాజెక్టులకు అమరావతి కేంద్రంగా మారింది. ఉద్దండరాయుని పాలెం సమీపంలో సుమారు 50 ఎకరాలలో నిర్మించబోతున్న క్వాంటం వ్యాలీ ప్రాజెక్ట్ మొదటి దఫా పనులు ఈ 2025 లో ప్రారంభం కాగా సుమారు 3000 కోట్ల పెట్టుబడులతో దాదాపు 80 వేల పైచిలుక ఉపాధి అవకాశాలతో క్వాంటం వ్యాలీ నిర్మాణం 2026 టార్గెట్ గా పనులు మొదలయ్యాయి.
అలాగే VIT, SRM వంటి ప్రతిష్ఠామకమైన విద్యాసంస్థలకు తోడు బిట్స్ బిలాని వంటి ప్రముఖ అంతర్జాతీయ యూనివర్సిటీలు సైతం అమరావతి లో నిర్మాణాలను ప్రారంభించాయి. దీనితో భవిష్యత్ లో అమరావతి అటు టెక్నాలజీ ఇటు ఎడ్యుకేషనల్ హబ్ గా రూపొందనుంది.
* రాజధాని రైతులకు భూకేటాయింపులు – కొత్త భూ సమీకరణ:
రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతు కుటుంబాలకు ఈ ఏడాది ప్రభుత్వం వారికి ఈ – లాటరీ పద్డతిలో ప్లాట్లను కేటాయించింది. మొత్తంమీద ఈ 2025 లో రాజధాని రైతులకు భూకేటాయింపుల రూపంలో సుమారు 3 వేల ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. అలాగే రాబోయే 5, 6 నెలలో రాజధాని రైతుల భూకేటాయింపులను ప్రభుత్వం పూర్తి చేస్తుంది అంటూ మంత్రి నారాయణ రాజధాని రైతు కుటుంబాలకు హామీ ఇచ్చారు.
అలాగే అమరావతి లో ఇంటర్ నేషనల్ ఎయిర్ ఫోర్ట్ నిర్మాణానికి గాను సుమారు మరో 5 వేల ఎకరాలకు గాను కొత్తగా
భూ సమీకరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
* ముఖ్యమంత్రి బాబు సొంతింటి నిర్మాణం:
ఇన్నాళ్ళుగా రాష్ట్ర రాజధానిలో చంద్రబాబు సొంత ఇల్లు లేదు, ఆయనకే అమరావతి నిర్మాణాలు మీద నమ్మకం లేదు అంటూ వైసీపీ చేసిన రాజకీయ విమర్శలకు కూడా ఈ 2025 గట్టి సమాధానం చెప్పింది. 2025 ఏప్రిల్ 9 న వెలగపూడి సెక్రటేరియట్ వెనుక ఉన్న 5 ఎకరాల స్థలంలో చంద్రబాబు కుటుంబం తమ సొంతింటి నిర్మానికి భూమి పూజ చేసారు.
* చట్టబద్ధత:
ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాష్ట్ర రాజధాని మారుతుంది, మరాలి అనేలా వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర రాజధానితో జగన్ అండ్ కో మూడుముక్కలాట ఆడుకున్న సందర్భంలో రాజధానికి ఒక చట్టబద్ధత ఉండాలని, రాజకీయ పార్టీల రాజకీయ క్రీడలో రాష్ట్ర భవిష్యత్ నలిగిపోకూడదని, అలాగే రాజధాని కోసం భూములిచ్చిన రైతు కుటుంబాలకు ఒక భద్రతా, భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అంటూ పార్లమెంట్ లో చట్టం చేసేందుకు ఈ ఏడాది తొలి అడుగు పడింది.
* ప్రభుత్వ కాంప్లెక్స్ ల నిర్మాణాలు:
రాజధాని అమరావతిని సూచించేలా A సూచికగా ప్రభుత్వ భవనమైన CRDA ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించి అమరావతి కేంద్రంగానే పనులు సాగిస్తున్నారు. అలాగే లెజిస్టేటివ్ అసెంబ్లీ, హై కోర్ట్, ప్రభుత్వ ఉన్నతాధికారుల వసతి గృహాలు వంటి వాటికి 2025 లో పునాదులు పడ్డాయి.
ఇలా 2025 అమరావతి అభివృద్ధికి సాక్ష్యంగా నిలిచింది, అలాగే రాష్ట్ర భవిష్యత్ కి పురోగతి అనే పునాది వేసింది.






