రాష్ట్ర రాజధాని అమరావతిలో అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. అందులో భాగంగానే నేడు అమరావతిలో 25 బ్యాంకులు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది.
అమరావతిని ఆర్థిక హబ్ గా మార్చేందుకు ఈ నిర్మాణాలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ ఆర్థిక సంస్థల ఏర్పాటు ద్వారా రాష్ట్రానికి సుమారు 13 వేల కోట్లు పెట్టుబడులుగా రానున్నాయని, తద్వారా దాదాపు 6 వేలమందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుందంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ కార్యక్రమానికి హాజరయిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, ఐటీ మంత్రి లోకేష్, మంత్రి నారాయణ, ఎంపీ పెమ్మసాని రాజధాని రైతుల త్యాగాల పైన ప్రశంసలు కురిపించారు, అలాగే అమరావతి అభివృద్ధి పైన నమ్మకాన్ని కల్పించారు.
సుమారు 34 వేల ఎకరాల రైతుల త్యాగం, వారి ‘నమ్మకం’ వైసీపీ హయాంలో సమాధైనా అమరావతికి తిరిగి జీవం పోసింది. అలాగే దేవత రాజధానిగా అమరావతికి ప్రాణ ప్రతిష్ట చేసిన బాబు బలమైన ‘సంకల్పం’ అమరావతిని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుంది.
ఇక ఆర్థిక లోటుతో అల్లాడుతున్న ఏపీ కి రాజధాని నిర్మాణం కొరకు ‘సాయం’ చేస్తున్న కేంద్ర సహకారం అమరావతిలో నిర్మాణాల పనులను పరుగులు పెట్టిస్తుంది. అంటే రాజధానిగా అమరావతి తిరిగి ఊపిరి పోసుకోవడంలో రైతుల నమ్మకమైన త్యాగం, బాబు బలమైన సంకల్పం, కేంద్ర సహకారంతో కూడిన ఆర్థిక సాయం ప్రముఖ పాత్ర పోషించాయి అనేది వాస్తవం.
అలాగే రైతుల నమ్మకానికి, బాబు సంకల్పానికి, కేంద్ర సాయానికి వైసీపీ అనే అడ్డంకి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇటు రాష్ట్ర ప్రభుత్వం తో పాటుగా అటు కేంద్ర ప్రభుత్వం పై కూడా ఉంటుందనేది బీజేపీ గ్రహించాలి. ఇక అందుకు తగ్గట్టే రాజధానిగా అమరావతికి చట్ట బద్ధత కల్పించడం అనేది బీజేపీ ముందున్న ప్రధమ కర్తవ్యయం అని గుర్తించాలి.






