వైసీపీ భారీ మెజారిటీతో పూర్తి 5 ఏళ్ళు అధికారంలో ఉన్న కనీసం రాష్ట్రంలో రోడ్ల గుంతలు కూడా పూడ్చలేకపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే అమరావతి, పోలవరం వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణ పనులు చకాచకా పరుగులు తీస్తున్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులు, వాటితో పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలు ఏర్పాటవుతున్నాయి.
తెలంగాణలో కేసీఆర్ పదేళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ళు కలిపి 12 ఏళ్ళపాటు ప్రయత్నించినా వరంగల్ వద్ద విమానాశ్రయం ఏర్పాటు చేసుకోలేకపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్దమవుతోంది. ఈనెల 4న తొలి విమానం ల్యాండ్ అయ్యింది కూడా! జూన్-జూలై నెలలో ప్రారంభోత్సవం కాబోతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని పనులు, ఇంత అభివృద్ధి జరుగుతుంటే, కూటమి ప్రభుత్వం వీటి గురించి గొప్పగా చెప్పుకోలేని పరిస్థితి కల్పిస్తోంది వైసీపీ! కల్తీ నెయ్యి వ్యవహారం, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీలలపై జరుగుతున్న చర్చ లేదా వాదోపవదాలే ఇందుకు నిదర్శనం.
ఏది ఏమైనప్పటికీ, అభివృద్ధి నుంచి సిఎం చంద్రబాబు నాయుడు దృష్టిని వైసీపీ మళ్ళించలేకపోతోందనేది కూడా వాస్తవం. కనుక ఎన్ని భీకర యుద్ధాలు జరుగుతున్నా అభివృద్ధి మాత్రం ఆగడం లేదు.
ఇందుకు తాజా నిదర్శనంగా దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలలో ఒకటైన బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ సైన్స్ (బిట్స్ పిలానీ) అమరావతికి రప్పించడమే.
అమరావతిలో మందడం, వెంకటపాలెం గ్రామాల పరిధిలో 70 ఎకరాల విస్తీర్ణంలో బిట్స్ పిలానీ ఏర్పాటు కాబోతోంది. దీని కోసం సీఆర్డీఏ అధికారులు, బిట్స్ పిలానీ ప్రతినిధి మందడం సబ్ రిజిస్ట్రార్ రాంబాబు సమక్షంలో శుక్రవారం ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి.
మొదటి దశలోనే వెయ్యి కోట్లతో అత్యాధునిక పర్యావరనహిత భవన సముదాయాలు నిర్మిస్తారు. వచ్చే ఏడాది నుంచే దీనిలో విద్యార్ధులకు ప్రవేశాలు కల్పించి తరగతులు మొదలుపెట్టే విధంగా శరవేగంగా నిర్మాణ పనులు జరుపుతామని బిట్స్ పిలానీ ప్రతినిధులు చెప్పారు. మొత్తం 10,000 మంది విద్యార్ధులకు సరిపడేవిధంగా మూడు దశలలో బిట్స్ పిలానీ భవన సముదాయాలు నిర్మిస్తామని తెలిపారు.
బిట్స్ పిలానీ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అమరావతిలో నిర్మించాబోతుంటే దాని గురించి గొప్పగా చెప్పుకోవలసిన ఈ సమయంలో కల్తీ నెయ్యి వ్యవహారం, అరవ శ్రీధర్ రాసలీలల గురించి మాట్లాడుకోవలసి రావడం భాదాకరమే కదా?






