ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకే సమయంలో ఓ విచిత్రమైన పరిణామం జరుగుతోంది. అమరావతిలో హైకోర్టు నూతన భవన సముదాయానికి మంత్రి నారాయణ భూమిపూజ చేశారు. దీనికి గతంలోనే భూమిపూజ చేసి రాఫ్ట్ ఫౌండేషన్ పనులు ప్రారంభించినా, జగన్ ప్రభుత్వం ఐదేళ్ళ పాటు వాటిని నిలిపివేసింది.
ఆ కారణంగా ఇప్పుడు మరోసారి భూమిపూజ చేసి పనులు తిరిగి ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ హైకోర్టుకు అత్యవసరంగా భవనం అవసరమవడంతో అమరావతిలో తాత్కాలిక భవనాన్ని నిర్మించారు. తాత్కాలిక భవనం కోసం అంత ఖర్చు అవసరమా అంటూ నాడు వైసీపీ పదేపదే విమర్శించింది.
కానీ అదే భవనంలో 2027 వరకు హైకోర్టు కొనసాగుతుంది. దాదాపు పదేళ్ళపాటు న్యాయవ్యవస్థ సజావుగా సాగాలంటే సరైన మౌలిక సదుపాయాలు అవసరమనే సిఎం చంద్రబాబు నాయుడి ఆలోచన సరైందేనని ఇప్పుడు స్పష్టమవుతోంది. అమరావతిలో నిర్మించిన సచివాలయం, శాసనసభ భవనాలకూ ఇదే వర్తిస్తుంది.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని, హైకోర్టు, సచివాలయం వంటి కీలక మౌలిక వసతులు లేవు. అందుకే అవి అత్యవసరంగా నిర్మించుకోవాల్సి వచ్చింది.
కానీ 2014లో తెలంగాణ ఏర్పడే నాటికే హైదరాబాద్‌లో హైకోర్టు, సచివాలయం, శాసనసభ వంటి భవనాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. అయినప్పటికీ సచివాలయానికి వాస్తుదోషమంటూ కేసీఆర్ సుమారు 1,200 కోట్లు ఖర్చు చేసి కొత్త సచివాలయం నిర్మించారు.
మరో 500-600 కోట్లు ఖర్చు చేసి ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్‌ను కూడా నిర్మించారు. తెలంగాణ హైకోర్టు భవనం నిర్మించి వందేళ్ళు పైబడటంతో అది శిధిలావస్థకు చేరుకుంటోంది. ప్రస్తుత అవసరాలకు అది సరిపోవడం లేదు.
కనుక రాజేంద్రనగర్ వద్ద కొత్త హైకోర్టు భవన సముదాయాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి కూడా ఇదే కావడంతో దానికీ కొత్త భవన సముదాయం నిర్మిస్తున్నారు.
తెలంగాణ శాసనసభ, మండలి భవనాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కానీ ఆర్థిక పరిమితుల కారణంగా ప్రస్తుతం ఉన్న భవనాలకు మరమ్మత్తులు చేసి ఉపయోగిస్తున్నారు. కానీ భవిష్యత్తులో కొత్త భవనాలు నిర్మించక తప్పని పరిస్థితి ఉంటుంది.
తెలంగాణకు వడ్డించిన విస్తరి వంటి హైదరాబాద్ లభించినప్పటికీ మళ్ళీ ఇన్ని నిర్మాణాలు అవసరమవుతున్నాయి. ఏపీకి ఏవీ లేకపోవడం వలన అన్నీ నిర్మించుకోవలసి వస్తోంది. అంతే తేడా!
అమరావతిలో నిర్మించనున్న ఏపీ హైకోర్టు భవనం గతంలో అనుకున్న డిజైన్, ప్రణాళిక ప్రకారమే 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ భవనానికి మొత్తం ఎనిమిది అంతస్తులు ఉంటాయి.
వాటిలో రెండో, నాలుగో, ఆరవ అంతస్తుల్లో మొత్తం 52 కోర్టులు ఏర్పాటు చేస్తారు. ఎనిమిదో అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లతో విశాలమైన గార్డెన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఈ నిర్మాణ పనులను డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు వేగంగా కొనసాగిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. తెలంగాణ హైకోర్టు నిర్మాణ పనులు కూడా ఇంచు మించు అదే సమయానికి పూర్తయ్యే అవకాశం ఉంది.






