
రాజధాని అమరావతి కోసం సిఎం చంద్రబాబు నాయుడు భూసేకరణ చేసినప్పుడు చాలా అవరోధాలు, విమర్శలు ఎదురయ్యాయి. అయినప్పటికీ నిబ్బరంగా ముందుకు సాగి ఆ ప్రక్రియ పూర్తిచేసి రాజధాని నిర్మాణ పనులు కూడా చేపట్టారు.
అ తర్వాత ఎన్నికలలో టీడీపీ ఓడిపోవడం.. జగన్ పాలన, వైసీపీ ఓటమి, కూటమి గెలుపు వరకు జరిగిన రాజకీయ పరిణామాలన్నీ అందరూ చూశారు.
Also Read – యుద్ధాలతో కనపడే విధ్వంసం కొంత.. కనపడనిది అనంతం!
ఈ రాజకీయాల కారణంగా అంత పెద్ద ప్రాజెక్ట్ మద్యలో ఆగిపోయింది. దాని వలన జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. జగన్ తప్పుడు నిర్ణయాల వలన పెరిగిన ఆ అదనపు భారాన్ని రాష్ట్ర ప్రజలే మోయాల్సివస్తోంది కదా?
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో మళ్ళీ అమరావతి పనులు వేగం పుంజుకున్నాయి. మూడేళ్ళలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొని పనులు జరిపిస్తున్నామని పురాపాలక శాఖ మంత్రి నారాయణ పదేపదే చెపుతున్నారు. చెప్పినట్లుగా మూడేళ్ళలో పూర్తిచేసి చూపిస్తే అందరికీ సంతోషమే.
Also Read – రాష్ట్ర ప్రయోజనాల కోసం క్రెడిట్ త్యాగం.. అవసరమే
కానీ మళ్ళీ అమరావతి రెండో దశ కోసం 40-45 వేల ఎకరాలు భూసమీకరణకు ప్రభుత్వం సిద్దం అవుతుండటం ఆందోళన కలిగించే విషయమే.
అంతర్జాతీయ విమానాశ్రయం, స్మార్ట్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ సిటీల కోసం ఈ భూసమీకరణ చేపట్టబోతున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. అమరావతి మొదటి దశలో నియమ నిబంధనలే రెండో దశ భూసమీకరణకు కూడా వర్తింపజేస్తామని చెప్పారు.
Also Read – వైసీపీ ‘రక్త దాహం’ తీరలేదా.?
సిఎం చంద్రబాబు నాయుడుకి చాలా దూరదృష్టి ఉంది కనుక ముందుచూపుతో ఇవన్నీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. చాలా సంతోషమే.
కానీ రాజకీయాల కారణంగా రాజధాని మొదటి దశలో ఎదురైన ఆటుపోట్లు విస్మరించకూడదు. ఆ రాజకీయ పరిణామాలతో సహా అన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం.
అమరావతి మొదటి దశ పూర్తవ్వలన్నా రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలు అన్నీ ఇలాగే ఉండి తీరాలి. రెండో దశ పనులు జరగాలంటే రెండు చోట్ల మళ్ళీ ఎన్డీఏ తప్పనిసరిగా అధికారంలోకి రావాల్సి ఉంటుంది. అప్పుడే అమరావతి 2.0 కి ఎటువంటి ఆటంకాలు ఉండవు. కానీ వీటిలో ఎక్కడ తేడా వచ్చినా చరిత్ర పునరావృతం అవుతుందని మరిచిపోకూడదు.
మరో విషయం ఏమిటంటే, జగన్ అమరావతిని పూర్తి చేస్తారనుకుంటే మూడు రాజధానులతో డ్రామాలు ఆడుతూ కాలక్షేపం చేసి ప్రజలను తీవ్ర నిరాశ పరిచారు. కనుక చంద్రబాబు నాయుడు మాత్రమే అమరావతిని పూర్తిచేస్తారనే నమ్మకంతో మళ్ళీ అధికారం కట్టబెట్టారు.
కనుక అమరావతి, పోలవరం పూర్తిచేయడమే ఏకైక లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగడం మంచిది. మద్యలో ఇటువంటి భారీ ప్రాజెక్టులని నెత్తిన పెట్టుకొని, అమరావతిని పూర్తిచేయలేకపోతే ప్రజలు మళ్ళీ జగన్ వైపు చూసే ప్రమాదం పొంచి ఉంటుంది. ఎన్నికల నాటికి జగన్, అనుకూల శక్తులు బలపడినా ఆశ్చర్యం లేదు.
కనుక 2029 ఎన్నికల నాటికి అమరావతి, పోలవరం రెండూ పూర్తిచేసి ప్రజలకు చూపించాల్సిన బాధ్యత పూర్తిగా చంద్రబాబు నాయుడుపైనే ఉంటుంది. అప్పుడే ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.