నవ్యాంధ్ర రాజధానిగా ఎంపికైన అమరావతి చుట్టూ జరిగిన రాజకీయ సంఘటనలు తెలిసినవే. తాజాగా ఆ రాజకీయ పార్టీలు కొలువు తీరడానికి అమరావతిలో స్థలాలను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పార్టీల స్థాయిని బట్టి ఈ కేటాయింపులు జరిపినట్టు ఏపీ ప్రభుత్వం పేర్కొంది. జాతీయ, ప్రాంతీయ పార్టీల గుర్తింపు ప్రకారం స్థలాల కేటాయింపు పాలసీని ఖరారు చేసింది.
శాసనసభలో 50 శాతం కంటే ఎక్కువ సీట్లు ఉన్న పార్టీలకు సీఆర్డీఏ పరిధిలో 4 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. 25 నుంచి 50 శాతం మధ్య సీట్లు ఉంటే అర ఎకరం స్థలం, అలాగే అసెంబ్లీలో ఆ పార్టీకి కనీసం ఒక్క సభ్యుడైనా ఉంటే వెయ్యి గజాల స్థలం కేటాయించింది. దీంతో నవ్యాంధ్ర రాజధానిలో రాజకీయ పార్టీల హంగామా షురూ కానుంది. అమరావతిలో పంపిణీ ఈ విధంగా ఉంటే, జిల్లా కేంద్రాల్లో కూడా ఇదే పధ్ధతిలో రాజకీయ పార్టీ కార్యాలయాలకు స్థలాలు కేటాయించింది ఏపీ సర్కార్.
మొదటి శ్రేణికి చెందిన పార్టీలకు జిల్లా కేంద్రాల్లో రెండెకరాలు కేటాయించగా, ద్వితీయ శ్రేణి పార్టీలకు వెయ్యి గజాల స్థలం కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక మూడో శ్రేణి పార్టీలకు 300 గజాల కేటాయింపు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలకు స్థలాలు దక్కే అవకాశం లేదు. బీజేపీకి మాత్రం వెయ్యి గజాల స్థలం దక్కే అవకాశం ఉంది.



