అభివృద్ధికి నిదర్శనాలు ఉద్యోగాలు, ఉపాధి కోసం తరలివచ్చే ప్రజలు లేదా భారీగా ఆదాయ మార్గాలు. మౌలిక సదుపాయాలు వంటివివి చాలానే ఉన్నాయి.
ఆ జాబితాలో గంజాయి, మాదక ద్రవ్యాలు కూడా వ్రాసుకోక తప్పదేమో అనిపిస్తుంది. హైదరాబాద్‌లో తరచూ పట్టుబడుతున్న గంజాయి, మాదక ద్రవ్యాలు. ఎన్ని రైడ్స్ జరుగుతున్నా యధేచ్చగా ఫామ్‌హౌసులలో సాగుతున్న డ్రగ్స్ పార్టీలు చూస్తున్నప్పుడు.
మాదక ద్రవ్యాల కట్టడికి తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ఇటీవల అవగాహనా సదస్సులో చేసిన వ్యాఖ్యలు గమనిస్తే, కాలేజీ విద్యార్ధులు కూడా ‘డ్రగ్స్’కి అలవాటు పడుతున్నారనే అనుమానం కలుగుతోంది.
“ఇకపై ఏదైనా కాలేజీల ఆవరణలో డ్రగ్స్ పట్టుబడితే ఆ కాలేజీ గుర్తింపు రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాలేజీలలో ప్రవేశాల సమయంలోనే ‘డ్రగ్స్’కు దూరంగా ఉంటామని, ఒకవేళ విద్యార్ధులు పట్టుబడితే కటిన చర్యలు తీసుకోవచ్చని తల్లితండ్రుల నుంచి లిఖిత పూర్వకంగా హామీ పత్రం తీసుకోవాలని సూచించారు.
టాలీవుడ్‌లో ‘డ్రగ్స్’ స్టోరీలు అందరికీ తెలిసినవే. అలాగే రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు లేదా వారి పుత్ర రత్నాలు ఎంతమంది పట్టుబడినా, అందరూ పరపతి గలవారే కనుక ఎవరిపై చర్యలు తీసుకోలేని నిసహయత ఈ డ్రగ్స్ మహమ్మారికి ఊపిరి పోస్తోందని అనుకోవచ్చు.
‘హైదరాబాద్‌లో డ్రగ్స్’ నేపధ్యంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి?అని ఆలోచిస్తే కొంచెం ఆందోళనకరంగానే అనిపిస్తుంది.
హైదరాబాద్‌కు రవాణా అయ్యే గంజాయిలో అత్యధిక శాతం ఒడిసా నుంచే అవుతుందని ఇప్పటికే స్పష్టమైంది. హైదరాబాద్‌తో పోలిస్తే ఒడిసాతో సరిహద్దు పంచుకుంటూ, దానికి మరింత సమీపంలో ఉన్న విశాఖకు మున్ముందు ఈ సమస్య మరింత తీవ్రంగా ఉండవచ్చు.
విశాఖకు రోడ్డు, రైలు, విమాన మార్గాలతో పాటు సముద్ర మార్గం కూడా ఉన్నందున గంజాయి రవాణాకు మరింత వెసులుబాటుగా మారుతుంది.
ముఖ్యంగా ఐటి, పరిశ్రమలతో ఆర్ధిక రాజధానిగా అవతరిస్తున్న విశాఖ నగరానికి ఉద్యోగాలు, ఉపాధి కోసం దేశం నలుమూలల నుంచి ప్రజలు వస్తారు. బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు అలాగే వచ్చారు. కనుక విశాఖ పరిస్థితి ఏమిటి?
శరవేగంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతున్న సీమ జిల్లాల పరిస్థితి ఏమిటి? అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్దమవుతున్న అమరావతికి అనేక దేశవిదేశాలకు చెందిన కంపెనీలు, ఉన్నత విద్యా, వాణిజ్య సంస్థలు తరలి రాబోతున్నాయి.
కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, ముఖ్యంగా గంజాయి కట్టడి ఎలా?అని ప్రభుత్వం, పోలీసులు ఆలోచించాల్సిన సమయం ఇదే.




