ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశం జరుగబోతోంది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించడానికే ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నారు. మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి అమరావతి అనే పేరు కూడా వినపడకుండా చేయాలనుకుంటే, సిఎం చంద్రబాబు నాయుడు అమరావతే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా శాసనసభలో తీర్మానం చేయబోతున్నారు. నాడు జగన్ అమరావతి పట్ల అంత దుర్మార్గంగా వ్యవహరించకపోయి ఉంటే నేడు సిఎం చంద్రబాబు నాయుడు ఈ ఆలోచనే చేసేవారు కారు. కనుక శాసనసభలో తీర్మానం క్రెడిట్ సిఎం చంద్రబాబు నాయుడుకి కాదు.. మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డికే ఖచ్చితంగా దక్కుతుంది.
పార్లమెంట్ చేత అమరావతిని ఏపీకి రాజధానిగా గుర్తించేలా చేసేందుకు సిఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో మాట్లాడి ఒప్పించారు. ఈ పార్లమెంట్ సమావేశాలలోనే ఆమోదం తెలిపేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. కానీ పార్లమెంట్ ఆమోదం పొందాలంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి సిఫార్సు రావాలి. కనుక ఆలస్యం చేయకుండా శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించి తీర్మానం చేసి కేంద్రానికి పంపించబోతున్నారు.
ఒకసారి పార్లమెంట్, రాష్ట్రపతి ఆమోదముద్ర పడితే, భవిష్యత్‌లో ఎప్పుడైనా మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అయినా అమరావతిని మార్చలేరు. మార్చాలనుకుంటే హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా అంగీకరించవు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా చేయిస్తూనే, భవిష్యత్‌లో మళ్ళీ ఎన్నడూ ఇలాంటి సమస్యలు తలెత్తకుండా సిఎం చంద్రబాబు నాయుడు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అభినందనీయమే. అయితే ఈ తీర్మానానికి జగన్ టీమ్ మద్దతు ఇస్తుందా లేదా కుంటిసాకుతో మొహం చాటేస్తుందా? చూడాలి.
కానీ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేకపోయినా 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు కట్టించిన శాసనసభ, సచివాలయంలో కూర్చొనే పనిచేయాల్సి వచ్చింది. ఒకవేళ భవిష్యత్‌లో ఎప్పుడైనా మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు కూడా తాను ఎంతగానో అసహ్యించుకున్న అమరావతినే రాజధానిగా అంగీకరించి, అక్కడి నుంచే పాలించక తప్పదు. కనుక ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అమరావతికి జై అనగలరా?




