గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ అధినేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నా పై ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధికార ప్రతినిధి విమర్శలు చేస్తే మా పార్టీ నేతలకు బీపీలు రావా.? మా పార్టీ కార్యకర్తలు దాడులకు దిగరా.? అంటూ నాడు పట్టాభి పై చర్యలను సమర్ధించిన వైసీపీ, టీడీపీ పార్టీ కార్యాలయాల మీద వైసీపీ దాడులను వెనకేసుకొచ్చిన జగన్ ఇప్పుడు అంబటి విషయంలో ప్లేటు మారుస్తున్నారు.
తిరుమల లడ్డు నెయ్యి కల్తీ విషయంలో కూటమి vs వైసీపీ గా సాగుతున్న విమర్శలు ప్రతివిమర్శల నేపథ్యంలో నేడు గుంటూరు వైసీపీ ఇంచార్జ్, మాజీ మంత్రి అంబటి రాంబాబు గోరంట్ల కేంద్రంగా నడిపిన రాజకీయం, చూపిన అత్యుత్సాహం టీడీపీ శ్రేణులకు బీపీలు తెప్పించాయి.
నాడు వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ నాటి వైసీపీ లీడర్లు, క్యాడర్ రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ కార్యాలయాల మీద దాడులకు తెగబడ్డారు, తాడేపల్లి లో డీజీపీ ఆఫీస్ కి కూతవేటు దూరంలో ఉన్న ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయం మీద విచక్షణరహితంగా దాడులకు పాల్పడ్డారు.
దాడులను అడ్డగించిన వారి తలలు పగలకొడుతూ, కార్యాలయం లోని ఫర్నిచర్ ను ధ్వంశం చేస్తూ ఆ ప్రాంతమంతా నానా భీభత్సం చేసారు వైసీపీ నాయకులు. ఒక వీధి గుండాలు మాదిరి, కిరాయి రౌడీ మూకల తరహాలో వ్యవహరించారు వైసీపీ శ్రేణులు. అయితే ఆ చర్యలన్నంటిని మా పార్టీ శ్రేణులకు బీపీలొచ్చాయి అంటూ కప్పిపుచ్చేసుకున్నారు జగన్.
మరి ఇప్పుడు అంబటి అనుచిత, అసందర్భ వ్యాఖ్యలకు కూడా టీడీపీ శ్రేణులకు బీపీ లు రావా.? మరి వారి బీపీల మూల్యాన్ని కూడా వైసీపీ భరిస్తుందా.? అందుకు వైసీపీ సిద్ధమా.? అలాగే నాడు ఆ అనుచిత వ్యాఖ్యలను తప్పుబట్టి పట్టాభి పై చర్యలకు పాల్పపడ్డ జగన్ నేడు కూడా అదే మాదిరి అంబటి వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ మంత్రి మీద చర్యలు తీసుకుంటారా.?
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బహిరంగంగా పోలీసుల ఎదుట, మీడియా సాక్షిగా ఎటువంటి బెరుకు, భయం లేకుండా అంబటి ఇంతటి దుస్సాహసానికి ఒడిగట్టారు అంటే అది వైసీపీ నుంచి వచ్చిన బరితెగింపుగా భావించాలా.? లేదా కూటమి ప్రభుత్వంలో ఉన్న అలసత్వానికి నిదర్శనం అనుకోవాలా.?
ఏదిఏమైనా కనీస ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ 164 సీట్లతో భారీ విజయాన్ని అందుకున్న కూటమి ప్రభుత్వాన్ని భయపెట్టాలని చూస్తుంది అనేది సుస్పష్టం. ఇలా ప్రతి విషయంలోనూ బాబు చూసి చూడనట్టు, పట్టీపట్టనట్టు వ్యవహరించడం అది తన పొలిటికల్ కెరియర్ కే కాదు పార్టీ భవిష్యత్ కి అత్యంత ప్రమాదకరంగా మారుతుందనేది బాబు గ్రహించాలి.
నాడు కొడాలి విషయంలోనూ బాబు ఇదే అలసత్వం వహించారు, దాని ఫలితమే ఇప్పుడు అంబటి బయటకొచ్చారు, రేపు ఇంకొకరు, ఆ తరువాత మరొకరు ఇలా కనీస పదవికి, వయసుకి, అనుభవానికి కూడా గౌరవం ఇవ్వకుండా ఇలా వారు దిగజారీ బాబు అనుభవాన్ని కించపరిస్తున్నారు.
అయితే నాడు టీడీపీ ప్రతిపక్షంలో ఉండి బాధిత పార్టీగా ప్రజల నుంచి సానుభూతి పొందింది, కానీ ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉండి కూడా బాధిత పార్టీగా మారిందంటే అది వైసీపీ విజయం అనడం కంటే టీడీపీ చేతకాని తనం అనడమే సమంజసం అంటూ టీడీపీ మద్దతుదారులు సైతం సోషల్ మీడియా వేదికగా వారి ధర్మాగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు.






