ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి, రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణాల గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన ఈ సమయంలో అందరూ వాటికి బదులు ‘మావిగన్’ గురించి మాట్లాడేలే చేయడం కూడా ఓ గొప్ప వ్యూహమేనని కూటమి పెద్దలు గ్రహించారో లేదో!
ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఎప్పటికైనా కోలుకుంటుందా? అని సామాన్య ప్రజలు సైతం ఆందోళన చెందుతున్న సమయంలో రాష్ట్రానికి వరుసగా భారీ, మద్య తరహా పరిశ్రమలు, ఐటి కంపెనీలు తరలివస్తుండటం చాలా సంతోషం కలిగిస్తుంది. వాటి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఇటీవల సిఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో క్వాంటం టెస్ట్ బెడ్స్ ఫెసిలిటీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నెల 25న విశాఖలో గూగుల్ కంపెనీకి శంకుస్థాపన చేయబోతున్నారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద రూ.70,000 కోట్ల పెట్టుబడితో ఆర్సలర్-మిట్టల్ స్టీల్ ప్లాంట్, మరో రూ.70 వేల కోట్లతో ఓ ప్రైవేట్ పోర్టు ఏర్పాటు కాబోతోంది. అనకాపల్లి జిల్లాలోనే రాంబిల్లి వద్ద 200 ఎకరాలలో రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలను తయారుచేసే కేంద్ర ప్రభుత్వం సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఏర్పాటు కాబోతోంది.
అనకాపల్లి జిల్లాలోనే నక్కపల్లి గ్రామం వద్ద 100 ఎకరాలలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ (నైపర్)అనే మరో కేంద్రప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థ రాబోతోంది.
పూడిమడక వద్ద ఎన్టీపీసీ-ఏపీ జెన్కో కలిసి రూ.1.20 లక్షల కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేస్తున్నాయి.
తాజాగా అనకాపల్లి జిల్లాలోనే రాంబిల్లి వద్ద ‘వారీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే కంపెనీ రూ.8,175 కోట్లు పెట్టుబడితో 300 ఎకరాల విస్తీర్ణంలో 16 గిగావాట్స్ సామర్ధ్యంతో లిథియం అయాన్ బ్యాటరీలు తయారుచేసే పరిశ్రమని ఏర్పాటు చేయబోతోంది. దీనిలో సెల్ ఫోన్లు, పవర్ బ్యాంక్ వగైరాలలో వాడే లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేస్తారు.
వచ్చే ఏడాది జూలై నాటికి మొదటి దశ నిర్మాణ పనులు పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెండో దశలో 20 గిగావాట్ అవర్ సామర్ధ్యం గల బ్యాటరీ ప్యాక్స్ తయారుచేస్తారు. ఈ పరిశ్రమలో ప్రత్యక్షంగా 3,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుంది.
ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. కనుక దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు కూడా ద్విచక్ర విద్యుత్ వాహనాలు, కార్లు కొనుగోలు చేస్తున్నారు. కనుక భవిష్యత్‌లో ఇలాంటి బ్యాటరీలకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. కనుక ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి పరిశ్రమలు మరిన్ని వచ్చే అవకాశం ఉంది.




