సినీ వేడుకలలో, ఆడియో ఫంక్షన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చేసే హడావుడి గురించి ఈ రోజు కొత్తగా చెప్పేదేముంది. దీనిపై ఏకంగా మరో మెగా హీరో అల్లు అర్జునే స్వయంగా అభిమానులకు క్లాస్ తీసుకున్నారు. అయితే అప్పటి నుండి పవన్ ఫ్యాన్స్ లో కాస్త మార్పు రావడం ఆహ్వనించదగ్గ పరిణామం. ఆడియో వేడుకలలో పవన్ గురించి చెప్పాలని గానీ, పవర్ స్టార్ పవర్ స్టార్… అనే నినాదాలు గానీ వినపడం తగ్గిపోయాయి. కానీ, శనివారం నాడు విజయవాడలో జరిగిన “వంగవీటి” ఆడియో వేడుకలో మరోసారి పవన్ నినాదాలు వెల్లువడడంతో అతిధుల సహనాన్ని మరోసారి పరీక్షించినట్లయ్యింది.
ఈ పరిణామాలతో పవన్ అభిమానులకు మళ్ళీ ‘గీతోపదేశం’ చేసే వంతు యాంకర్ ఝాన్సీకి వచ్చినట్లయ్యింది. “ఇక్కడికి వచ్చిన అతిధులను మీరు అవమానించాలనుకుంటున్నారా? మీ అభిమానాన్ని, ప్రేమను ఈ విధంగా ప్రదర్శించాలనుకుంటున్నారా? అలాగే మీ అభిమాన నటుడికి మీరిచ్చే గౌరవం ఇదేనా?” అని చెప్పగానే అభిమానులు మరింతగా చెలరేగిపోయారు. ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో… ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ‘తూతూ మంత్రంగా’ పవన్ కళ్యాణ్ జిందాబాద్ అనడం విశేషం. అయితే ఇదే ఒరవడి వర్మ ముందు చూపించాలనుకున్న అభిమానులకు అక్కడ ‘పప్పులు ఉడకకపోవడం’ విశేషం.



