మనుషులు బ్రతికి ఉన్నంత కాలమే ప్రేమలు, పగలు ప్రతీకారాలు. చనిపోయిన తర్వాత వాటికి అతీతులవుతారు. కానీ బ్రతికున్నవాళ్ళు అలా ఉండలేరు… అని నిరూపించారు ముద్రగడ పద్మనాభ రెడ్డి అనుచరులు, వైసీపీ శ్రేణులు. ఆయన జీవితం చివరి దశలో అభాసుపాలు చేసిన వైసీపీ, చనిపోయిన తర్వాత కూడా విడిచిపెట్టలేదు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాకతో ఒక్కసారిగా కిర్లంపూడిలో పరిస్థితి మారిపోయింది. అంతకు ముందు అక్కడ విషాదఛాయలు అలుముకొని ఉన్నాయి. ముద్రగడ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బాధపడుతున్నారు. ఆయన కుమార్తె క్రాంతి తండ్రిని చివరి చూపు చూసుకునేందుకు వచ్చినప్పుడు ముద్రగడ అనుచరులు ఆమెను అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి రాగానే తాము వచ్చింది పెద్దాయన అంత్యక్రియలకు అనే సంగతి మరిచినట్లు వైసీపీ శ్రేణులు ఉత్సాహంతో ఊగిపోయారు. అప్పుడు జగన్ వారిని వారించి ఉండాలి. కానీ అభివాదం చేసి లోనికి వెళ్ళారు.
ఓదార్పు, కుటుంబానికి అండగా నిలబడతాననే హామీ తర్వాత జగన్ తిరిగి వెళ్ళిపోయి ఉండి ఉంటే, ఆయన వెనకే వైసీపీ శ్రేణులు వెళ్ళిపోయేవి. అప్పుడు కుటుంబ సభ్యులు ప్రశాంతంగా పెద్దాయన అంత్యక్రియలకు ముందు కులాచారం ప్రకారం జరగాల్సిన కార్యక్రమాలు జరుపుకునేవారు.
కానీ జగన్ ఆయన పాడి మోయాలనుకున్నారు. కనుక అదే ప్రధానమైంది. పెద్దాయన పాడి మోయడం ఆయన పట్ల గౌరవ సూచకమే. కానీ పెద్దాయనకు దక్కాల్సిన శ్రద్దాంజలి, వీడ్కోలు కంటే జగన్ ఆయన పాడి మోయడమే హైలైట్ అవడం విచిత్రం.
సరే.. ఎవరికీ దక్కని అదృష్టం పెద్దాయనకు దక్కిందనుకున్నా ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు పోలీసులు వస్తే వారితో ఘర్షణ పడటం చూసినప్పుడు పాపం పెద్దాయనని ప్రశాంతంగా పోనీయలేదనిపిస్తుంది.
కాపు నాయకుడిని రెడ్డిగా మార్చిన వైసీపీ కనీసం అధికార లాంచనాలతో అంత్యక్రియలు జరిగే అవకాశం కూడా ఆయనకు లేకుండా చేశారు కదా?అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో వైసీపీ చేసిన ఈ హడావుడి అంతా దేనికి?సమాధానం అందరికీ తెలుసు.



