కూటమి ప్రభుత్వం పులిపై సవారీ?

Andhra Alliance Government

కూటమి ప్రభుత్వం పులిపై సవారీ చేస్తోందా? అంటే ఇదేం పిచ్చి ప్రశ్న అని హార్డ్ కోర్ టీడీపి నేతలు, వీరభక్త జనసైనికులు ఆగ్రహంతో ఊగిపోవచ్చు. కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధిపదంలో నడిపిస్తూ, రాష్ట్ర రాజకీయాలను శాశిస్తూ, వైసీపీ నేతలకు కేసులతో చుక్కలు చూపిస్తున్న కూటమి ప్రభుత్వం పులి మీద సవారీ చేయడం ఏమిటి? అని ప్రశ్నించవచ్చు.

కానీ పార్టీలు, రాజకీయాలకు అతీతంగా చూడగలిగితే నిజమే అని అంగీకరిస్తారు. కూటమి పార్టీ నేతలు, వాటి మద్దతుదారులు, శ్రేయోభిలాషులు ‘కూటమికి తిరుగులేదు. మరో 10-15 ఏళ్ళు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండబోతోంది,’ అని బల్లగుద్ది వాదిస్తున్నారు. నిజమే… అలానే జరిగితే చాలా సంతోషమే! అప్పుడే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలో నం.1గా నిలుస్తుంది.

ADVERTISEMENT

కానీ స్వోత్కర్షలో పడి కొన్ని వాస్తవాలు విస్మరించకూడదు. అవేమిటో చూద్దాం.

1. ఎన్నికలలో వైసీపీ ఓడిపోయినప్పటికీ ఇప్పటికీ ఆ పార్టీలో, దాని వైఖరిలో వచ్చిన మార్పులు. నాడు ఎక్కడ లోపలేస్తారో అని భయపడి ఎవరూ ఇళ్ళలో నుంచి బయటకు వచ్చేవారు కారు. కానీ నేడు జగన్‌ ఒక్క పిలుపు ఇస్తే వైసీపీ నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చేస్తున్నారు.

2. జగన్‌ బలప్రదర్శనలు చేస్తున్నారు. సిఎం చంద్రబాబు నాయుడుతో సహా ప్రభుత్వాధికారులను, పోలీస్ అధికారులను బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు.

3. అంబటి రాంబాబు వంటి నేతలు సిఎం చంద్రబాబు నాయుడుని బహిరంగంగానే బూతులు తిడుతున్నారు. జైలుకి పంపిస్తే అందుకు గర్వపడుతున్నారు. బయటకు వచ్చి హీరోలుగా మారుతున్నారు.

4. సిఎం చంద్రబాబు నాయుడు, పోలీసులు హెచ్చరికలను వైసీపీ శ్రేణులు కూడా ఖాతరు చేయడం లేదు. రప్పారప్పా అంటూ రెచ్చిపోతూనే ఉన్నారు.

5. వివేకా హత్య, మద్యం కేసుతో సహా ఏ ఒక్క కేసులో సూత్రధారులని ప్రభుత్వం టచ్ చేయలేకపోతోంది. వైసీపీకి ధైర్యం కల్పిస్తున్నది ఇదేకదా?

6. కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ ఒకటొకటిగా వ్యూహాలు అమలుచేస్తుంటే, కూటమి ప్రభుత్వం ‘డిఫెన్స్’ ఆటకే పరిమితమవుతోంది తప్ప దాని వ్యూహాలను ముందుగా పసిగట్టలేకపోతోంది. అడ్డుకోలేకపోతోంది.

7. కల్తీ నెయ్యి వ్యవవహారంలో వైసీపీ తిరుమల శ్రీవారిని లాగుతుంటే, కూటమి ప్రభుత్వం ఆ పాయింట్ వదిలేసి చెప్పులు, బూట్లు పట్టుకొని తిరుగుతోంది.

8. ఆ తర్వాతే బిజేపి నేతలు, స్వామీజీలు రంగంలో దిగారు. ఏడాదిగా ఇది సాగుతుంటే అందరూ ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? ఎందుకు నోరు విప్పలేదు?

9. కల్తీ నెయ్యిలో నుంచే ఓ ‘టైగర్ రాంబాబు’ ఆవిర్భవించి కాపు నాయకుడుగా గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాపు సామాజికవర్గాన్ని జనసేనకు దూరం చేసి బలహీన పరిచేందుకే ఈ ఎత్తుగడ అని అర్దమవుతున్నా కూటమి ప్రభుత్వంలో నిర్లిప్తత.

10. కేసులతో రాజకీయ మైలేజ్ కోసం తాపత్రయమే తప్ప ఆలస్యం చేస్తే అవే మన మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంటుందని గ్రహించడం లేదు. అందువల్లే సిఎం చంద్రబాబు నాయుడుకి, ‘హెరిటేజ్’కి కల్తీ మరకలు అంటించగలిగారు కదా?

11. అక్రమాస్తులు, వివేకా హత్య, మద్యం కేసులు నత్తనడకలు. ఏ అదృశ్యశక్తి వాటికి బ్రేకులు వేస్తోంది?వాటి పర్యవసానాలు ఏవిధంగా ఉండబోతున్నాయి?

కనుక ఆల్ ఈజ్ వెల్… మళ్ళీ మళ్ళీ మనమే వంటి కోరస్ పాటలు వినడానికి బాగానే ఉంటాయి… కానీ ఇలాంటి విషయాలను పట్టించుకోకపోతే కూటమి కథ కూడా 175/175 పాటలాగే ముగుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories