మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుని అమరావతి పేరుతో అప్పు చేసిన వైనం రాజకీయంగా వైసీపీ సర్కార్ ను కార్నర్ చేసిన విషయం తెలిసిందే. మూడు రాజధానుల బిల్లును మళ్ళీ తీసుకువస్తామని అప్పటి నుండి చెప్తున్నప్పటికీ, దాని సాధ్యాసాధ్యాలు మాత్రం కనుచూపు మేరలో కనపడడం లేదని రాజకీయ విశ్లేషకులు తేల్చేసారు.
వైసీపీ సర్కార్ కు కూడా ఈ విషయం తెలుసని, కానీ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని నాడు ప్రతిపక్షాలు కూడా మండిపడ్డాయి. అప్పటినుండి అడపాదడపా మూడు రాజధానులంటూ సందడి చేసిన వైసీపీ నేతలు ఇటీవల కాలంలో సైలెంట్ అయ్యారు. అయితే చాలాకాలం తర్వాత మళ్ళీ ఓ వైసీపీ మంత్రి మూడు రాజధానుల అంశంపై స్పందించారు.
ప్రస్తుతం 26 జిల్లాలు వస్తున్నాయిగా, అలాగే 3 రాజధానులు కూడా వస్తాయంటూ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. అయితే జిల్లాల విభజనకు కేంద్రం అడ్డుకట్ట వేసిన విషయం సదరు మంత్రి గారికి తెలియదో ఏమో గానీ, ముగిసిపోయిన మూడు రాజధానుల అంశాన్ని 26 జిల్లాలతో ముడిపెట్టి మాట్లాడారు. అంటే 3 రాజధానుల మాదిరే 26 జిల్లాల అంశాన్ని కూడా వెనక్కి తీసుకుంటారా?
ఏమో… వైసీపీ సర్కార్ విషయంలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అన్న అనుభూతులను పొలిటికల్ వర్గాల్లో కలిగించడంలో విజయవంతం అయ్యింది. ఈ జిల్లాల పెంపు కూడా మరో అప్పు కోసమే అన్న పంచ్ లు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయంటే, వైసీపీ సర్కార్ పాలన ఏ విధంగా ప్రజలను ఆకట్టుకుంటుందో అర్ధం చేసుకోవచ్చు. అప్పు అంటే గుర్తుకు వచ్చిన అంశం ఏమిటంటే… తాజాగా మరో 2 వేల కోట్ల అప్పు ఏపీ ఖాతాలో జమయ్యింది.



