అలుపెరుగని అమరావతి ఉద్యమం..ప్రజల ఆకాంక్షలు గుర్తించని ప్రభుత్వం

900_Days_for_Amaravati_Movementఅమరావతిని రాజధానిగా చేయాలంటూ పరిసర గ్రామాలకు చెందిన వేలాదిమంది రైతులు, మహిళలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. నేటితో వారి ఉద్యమానికి 900 రోజులు పూర్తయ్యాయి. ఇన్ని రోజులలో వారు ఎదుర్కొన్న సమస్యలు, రాజకీయ ఒత్తిళ్ళు, పోలీసుల దాష్టికాలు అన్నీ ఇన్నీ కావు. అయినప్పటికీ వారు ఏమాత్రం వెనకడుగు వేయకుండా నేటికీ తమ ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నారు.

రాజధాని నిర్మాణం కోసం తమ జీవనాధారమైన వ్యవసాయ భూములను అప్పగించినందుకు ప్రభుత్వం వారిని సన్మానించి గౌరవించాలి. కానీ వారిపై రాజకీయ గూండాలతో, పోలీసులతో దాడులు చేయిస్తోంది. పోలీసుల ఆంక్షలు, గృహ నిర్బందాలు, అరెస్టులతో వేధిస్తోంది. వారిపై అక్రమ కేసులు బనాయించి పోలీస్‌స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పుతూ మానసికంగా వేదిస్తోంది. ఈ కారణంగా వారు గత 900 రోజుల నుంచి తమ రోజువారీ కార్యక్రమాలు కూడా చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల పెళ్ళిళ్ళు, శుభకార్యాలు చేసుకోలేక బంధుమిత్రుల ఇళ్ళలో జరిగే శుభకార్యాలకు వెళ్ళలేకపోతున్నారు.

ADVERTISEMENT

అయినప్పటికీ పోలీసుల ఆంక్షలు, ఒత్తిళ్ళు ఎదుర్కొంటూనే రెండేళ్ల క్రితం జనవరి 5న తుళ్ళూరు నుంచి మందడం వరకు 29 గ్రామాల రైతులు, మహిళలు, వారి కుటుంబాలతో సహా పాదయాత్ర చేశారు. అక్కడి నుంచి బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి వెళ్ళబోతే మహిళలని కూడా చూడకుండా పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు.

ఆ తరువాత బైక్‌ ర్యాలీ, కోటప్ప కొండకు పాదయాత్ర చేశారు. ఆ తరువాత తమ ఉద్యమానికి 250 రోజులు పూర్తయినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 250 పట్టణాలలో సంఘీభావ ప్రదర్శనలు, నారీ సమరభేరీ కార్యక్రమాలు నిర్వహించారు. 300 రోజులు పూర్తయిన రోజున రైతు భేరీ పేరుతో సీఆర్‌డీఏ కార్యాలయాన్ని ముట్టడించి నిరసనలు తెలిపారు.

2021, నవంబర్‌ 1వ తేదీన న్యాయస్థానం టూ దేవస్థానం పేరుతో అమరావతిలో హైకోర్టు నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్రలో వారికి అడుగడుగునా పోలీసులు అవరోధాలు కల్పిస్తే, అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పట్టారు. దీనిని బట్టి అమరావతి ఉద్యమం పట్ల ప్రభుత్వ తీరు ఏవిదంగా ఉంది… ప్రజాభిప్రాయం ఏవిదంగా ఉంది? అనే విషయం స్పష్టమైంది.

అప్పటికే అమరావతిపై హైకోర్టులో అనేక పిటిషన్లు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. హైకోర్టు కూడా ప్రజల ఆకాంక్షలు గుర్తించి అమరావతిలో నిర్మాణపనులు మొదలుపెట్టాలని స్పష్టం చేసింది. మరోపక్క బిజెపి కూడా ప్రజల ఆకాంక్షలు గుర్తించి అమరావతినే రాజధానిగా చేయాలని తమ వైఖరిని స్పష్టం చేసింది. మరోపక్క టిడిపి, జనసేనలు అమరావతి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి.

దీంతో వైసీపీ ప్రభుత్వానికి వేరే గత్యంతరంలేక అయిష్టంగానే అమరావతి నిర్మాణ పనులు నత్తనడకన మొదలుపెట్టింది. కానీ ఆరేళ్ళలోగా పూర్తి చేయలేమని ముందే చెప్పింది. కనుక నేటికీ వైసీపీ ప్రభుత్వానికి అమరావతిని రాజధానిగా అంగీకరించడం లేదని స్పష్టమవుతోంది.

కానీ తన స్వార్ధ రాజకీయ అవసరాలు, ప్రయోజనాల కోసం అమరావతిని బలి పెడతామంటే న్యాయస్థానాలు, ప్రతిపక్షాలు, ప్రజలు ఊరుకోరని, వారిని కాదని మూడు రాజధానులు ఏర్పాటు చేయలేమని సంగతి వైసీపీ గ్రహించినా ఇంకా మూర్ఖంగానే వాదిస్తోంది. ప్రజల ఆకాంక్షలు గుర్తించని ఏ ప్రభుత్వానికైనా చివరికి అధోగతి తప్పదని అనేక నిదర్శనాలు ఉన్నా వైసీపీ ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లు ఇంకా మూడు రాజధానులకే మొగ్గుచూపుతుండటం పోయే కాలం వచ్చిన్నట్లే కనిపిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories