Andhra Pradesh Attracts Massive Investments Across State

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు తప్పనిసరి అంటూ జగన్‌ పాట పాడితే వైసీపీ నేతలు గుడ్డిగా వంతపాడారు తప్ప ఆ ఆలోచన తప్పని ఎవరూ చెప్పలేకపోయారు. ఒకవేళ జగన్‌ ఆలోచన సరైనదే అనుకుంటే, ఆ లెక్కన సువిశాలమైన భారతదేశానికి ఎన్ని రాజధానులు ఉండాలి? వందా.. రెండు వందలా?

చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేశారు. వచ్చే ఎన్నికలలోగా అమరావతినికి రూపురేఖలు వస్తాయి. అలాగని కేవలం అమరావతిని మాత్రమే కాకుండా రాష్ట్రంలో అటు చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందేందుకు భారీ పరిశ్రమలు పెట్టుబడులు రప్పిస్తున్నారు.

Also Read – అవినాష్, అనంతబాబుని పక్కన పెట్టుకొని జనసేనపై రాళ్ళు వేస్తే..

తిరుపతిలో స్పేస్ సిటీ (అంతరిక్ష రంగానికి చెందిన పరిశ్రమలు) ఏర్పాటుకి సన్నాహాలు మొదలుపెట్టారు. రేణిగుంటలో రూ.65,000 కోట్ల పెట్టుబడితో రిలయన్స్ సంస్థ 500 సీబీజీ ప్లాంట్స్ ఏర్పాటు చేయబోతోంది. వీటిద్వారా సుమారు 2.5 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయి.

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రూ. 1622 కోట్ల పెట్టుబడితో రిలయన్స్ సంస్థ బెవరేజెస్, పళ్ళరసాలు, కూల్ డ్రింక్స్, త్రాగునీళ్ళు ఉత్పత్తి చేసేందుకు 80 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోగా ఉత్పత్తి ప్రారంభించాలనే షరతు మీద భూకేటాయింపు చేసింది. దీనిలో 1200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. దీని వలన కర్నూలుతో సహా చుట్టుపక్కల జిల్లాలలో వేలాదిమంది రైతులకు మేలు కలుగుతుంది.

Also Read – ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ పవన్‌ కళ్యాణ్‌

టీసీఎస్ కంపెనీకి విశాఖలో ఐటి హిల్ నంబర్:3లో 21.16 ఎకరాలు కేటాయించింది. రూ.1,370 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కాబోతున్న ఈ టీసీఎస్ కంపెనీలో సుమారు 12,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

మరో ప్రముఖ ఐటి కంపెనీ కాగ్నిజెంట్‌ కూడా విశాఖలో ఏర్పాటు కాబోతోంది. కాపులప్పాడ ఐటి హిల్స్‌పై 22 ఎకరాలలో రూ.1583 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న కాగ్నిజెంట్ కంపెనీలో 8,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ కూడా విశాఖలో ఏర్పాటు కాబోతోంది.

Also Read – బీసీ రిజర్వేషన్స్: బీఆర్ఎస్‌లో గందరగోళం

విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో రూ.172.84 కోట్ల పెట్టుబడితో బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి ఆహార మరియు ఆయుర్వేద ఉత్పత్తులు తయారుచేసే పరిశ్రమని నెలకొల్పబోతోంది. రాబోయే రెండేళ్ళలో ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉద్యోగాలు, ఉపాది కల్పిస్తామని బాబా రాందేవ్‌ చెప్పారు.

అమెరికాకు చెందిన ఎగ్జామ్‌బిల్ కంపెనీ ప్రతినిధులు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో మూలపేట పారిశ్రామిక క్లస్టర్లో శుక్రవారం పర్యటించారు. అక్కడ రూ.85,000 కోట్ల పెట్టుబడితో ప్లాస్టిక్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ఆసక్తి చూపుతోంది. మూలపేటలో పోర్టు ఏర్పాటవుతోంది కనుక అక్కడ ప్లాంట్ ఏర్పాటుకి ఆసక్తి చూపుతున్నారు.