
తెలంగాణలో బీజేపి అధికారంలో లేదు కానీ ఎప్పుడూ చాలా చురుకుగా ఉంటుంది. ఏపీలో బీజేపి అధికారంలో భాగస్వామిగా ఉంది. కానీ తెలంగాణ బీజేపి అంత చురుకుగా ఉన్నట్లు కనిపించదు.
ఏపీ బీజేపి అధ్యక్షురాలు పురందేశ్వరి గొంతు తప్ప మరెవరిదీ పెద్దగా వినపడదు. ఆమె కూడా చాలా పరిమితంగానే మాట్లాడుతుంటారు. ఏపీ బీజేపి నేతలకు ఎన్నికలలో టికెట్లు, సీట్లు లభించలేదనే అసంతృప్తి వల్ల కావచ్చు లేదా సంకీర్ణ ధర్మం పాటించవలసి ఉంటుంది కనుక ఏపీ బీజేపి నేతలు విశ్రాంతి తీసుకుంటున్నారేమో?
Also Read – ఒకరు సస్పెండ్.. మరొకరు సస్పెన్స్.. అయినా తీరు మారలే!
రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్ తమ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తునప్పటికీ, పరామర్శ యాత్రల పేరుతో రెచ్చిపోతున్నప్పటికీ ఏపీ బీజేపి నేతల్లో చలనం కనిపించదు.
జగన్‌ని ఎదుర్కోవలసిన బాధ్యత తమది కాదు.. సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌లదే లేదా టీడీపీ, జనసేనలదే అన్నట్లు చూస్తుండిపోతున్నారు.
Also Read – కన్నీటికి ‘కోటా’ లేదు…
కనుక పురందేశ్వరి ఒక్కరే ముందుకు వచ్చి జగన్, వైసీపీలపై మొక్కుబడిగా రెండు విమర్శలు చేసి ‘మమ’ అనిపించేస్తుంటారు.
తెలంగాణలో ఎప్పటికైనా అధికారంలోకి వస్తామని అక్కడి బీజేపి నేతలకి, వారి అధిష్టానానికి కూడా నమ్మకం ఉంది కనుకనే వారు అంత చురుకుగా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలను ఎదుర్కొంటున్నారని భావించవచ్చు.
Also Read – కూటమి పై సామాన్యుడి ఆగ్రహం…
కానీ ఏపీలో బీజేపికి అటువంటి అవకాశం లేదు కనుక ఊరికే గొంతు చించుకోవడం దేనికి?రాజకీయాలంటూ హడావుడి చేయడం వలన ఏం ప్రయోజనం? అని భావిస్తున్నారేమో.. తెలీదు.
జూలై 1వ తేదీన ఏపీ, తెలంగాణ బీజేపిలకు కొత్త అధ్యక్షులను ఎంపిక చేస్తామని వారి అధిష్టానం ప్రకటించింది కనుక ఇప్పుడు ఏపీ బీజేపి నేతలు కూడా మళ్ళీ మీడియా ముందుకి వచ్చే అవకాశం వచ్చింది.
ఆ పదవి కోసం తెలంగాణలో ఇప్పటికే ముగ్గురు ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. బహుశః ఏపీలో కూడా పోటీ సాగుతుండవచ్చు.
కానీ ఈ విషయంలో కూడా ఏపీ బీజేపి నేతల హడావుడి ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.. ఆలోచింపజేస్తుంది.
ఏపీ బీజేపి అధ్యక్ష పదవితో ఒరిగేదేమీలేదనుకోవడం వల్లనే పార్టీలో సీనియర్లు తాపీగా కూర్చున్నారా?అనే సందేహం కలుగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే మళ్ళీ పురందేశ్వరినే ఏపీ బీజేపి అధ్యక్షురాలుగా కొనసాగించే అవకాశం ఉంది.