మోటర్లు కాలిపోకుండా మీటర్లట… చెవిలో పూలు కదా!

Andhra Pradesh Farrmers Bore Pump Electric Metersవినియోగదారులు నెలకి ఎంత విద్యుత్‌ వాడుకొంటున్నారో లెక్క కట్టేందుకు విద్యుత్‌ మీటర్లు పెడతారని అందరికీ తెలుసు. కానీ మోటర్లు, ట్రాన్స్ ఫార్మార్లు కాలిపోకుండా ఉండేందుకు, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసమే స్మార్ట్ మీటర్లు పెడుతున్నామని రాష్ట్ర ఇంధనశాఖ, సీఎండీలు చెప్పడం, దానిని సాక్షి మీడియా అచ్చేసి ప్రజల మీదకు వదలడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

రైతులు, ప్రజలు విద్యుత్‌ సమస్యలపై ఏనాడూ ఈవిదంగా స్పందించని ఉన్నతాధికారులందరూ కట్టకట్టుకొని ఒకేసారి ఎందుకు ప్రెస్‌మీట్‌ పెట్టారంటే, ఈనాడు మీడియాలో ‘రైతు చేనుకు కడప మీటరు,’ పేరుతో ఓ ఆర్టికల్ ప్రచురించినందుకే.

ADVERTISEMENT

దానిలో వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ మోటర్లకు మీటర్లు ఎందుకు పెడుతోందో, వాటి వలన రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయో వివరించింది. కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్కరణల పేరుతో ఉచిత విద్యుత్‌ పధకాలకి కత్తెర వేయాలని ప్రయత్నిస్తోందని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలకు అదనపు రుణం తీసుకొనేందుకు అనుమతిస్తామని ఎర వేస్తోందని, నిత్యం అప్పుల వేటలో ఉండే జగన్ సర్కార్ దాని కోసం మోటర్లకు మీటర్లు బిగిస్తోందని పేర్కొంది.

మొదట సాధారణ ఐఆర్‌డీఏ మీటర్లు పెట్టిన ప్రభుత్వం, వాటి స్థానంలో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తోంది. వాటి కొనుగోలు వెనుక భారీ స్కామ్‌ జరిగిందని ఈనాడు కధనంలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం విదిలించే అదనపు అప్పు కోసం,మీటర్ల కొనుగోలులో కమీషన్‌ కోసమే జగన్ సర్కార్ రైతుల మెడలకి ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తోందని ఈనాడు పేర్కొంది.

ఈ ఆరోపణలకు సంబందిత శాఖ మంత్రి లేదా మంత్రులు సంజాయిషీ ఇస్తే అది రాజకీయంగా స్పందించినట్లవుతుంది. దాంతో తమ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు అవకాశం కల్పించినట్లవుతుంది. అందుకే నలుగురు ఉన్నతాధికారుల చేత సంజాయిషీ చెప్పించినట్లు భావించవచ్చు.

అయితే విద్యుత్‌ శాఖను నడుపుతున్న వారు ట్రాన్స్ ఫార్మార్లు కాలిపోకుండా ఉండేందుకు, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసమే స్మార్ట్ మీటర్లు పెడుతున్నామని పచ్చి అబద్దాలు చెప్పడం చాలా దారుణం.

ఒక ఫ్రిజ్ లేదా ఏసీలు వోల్టేజి తేడాల వలన కాలిపోకుండా ఉండేందుకు స్టెబిలైజర్లు పెట్టుకొంటామని అందరికీ తెలుసు. కానీ విద్యుత్‌ వాడకాన్ని లెక్క కట్టే స్మార్ట్ మీటర్లే మోటర్లు కాలిపోకుండా కాపాడుతాయని వారు చెప్పడం రైతుల చెవిలో కాలీఫ్లవర్ పూలు పెట్టడమే కదా?

ప్రపంచంలో ఏ స్మార్ట్ మీటర్లు విద్యుత్‌ ఉత్పత్తి చేయవని, ఎన్టీపీసీ వంటి సంస్థలు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తే వాటిని డిస్కంలు సరఫరా చేస్తుంటాయని అందరికీ తెలుసు. కానీ స్మార్ట్ మీటర్లే నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తాయని విద్యుత్‌ ఉన్నతాధికారులు చెప్పడం చెవిలో మరో పూవే కదా?

నిజానికి స్మార్ట్ మీటర్లు దేనికంటే అవన్నీ ప్రీపెయిడ్ మీటర్లు కనుక! రైతులు తమకు ఎంత విద్యుత్‌ అవసరమో దానికి సరిపడా సొమ్ము చెల్లించి రీచార్జ్ చేసుకోవలసి ఉంటుంది. అప్పుడే విద్యుత్‌ సరఫరా అవుతుంది. లేకుంటే ఉచిత విద్యుత్‌ లభించదు!

దానికి రాష్ట్ర ప్రభుత్వమే సొమ్ము చెల్లిస్తుందని ఉన్నతాధికారులు వకాల్తా పుచ్చుకొని చెపుతున్నారు. కానీ ఈ చెల్లింపు వ్యవహారం ఒకసారో రెండుసార్లో జరిగే ప్రక్రియ కాదు. నిరంతర ప్రక్రియ. కనుక రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతుల ఖాతాలో సొమ్ము పడేందుకు అర్హతలు, నియమనిబందనలు పేరుతో కత్తెరవేయడం చాలా సులువు.

ఉద్యోగులకు జీతాలే సకాలంలో చెల్లించలేకపోతున్న రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టుకొన్న అర్హులైన రైతులకు నెలనెలా సకాలంలో విద్యుత్‌ ఛార్జీలు చెల్లిస్తుందా?చెల్లింపులో ఒక్క రోజు ఆలస్యమైన స్మార్ట్ మీటర్లు పనిచేయవు… విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుంది. అప్పుడు పంటలకు నీళ్ళు ఎలా పెడతారు? పెట్టలేకపోతే వాటి పరిస్థితి ఏమిటి?

ADVERTISEMENT
Latest Stories