ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. దానిలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపారు.
అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం, సిఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాలకు ఏరియా డెవలప్‌మెంట్ ఆధారిటీల ఏర్పాటుకి ఆమోదం తెలిపారు. ఇవి కాక మరికొన్ని బిల్లులపై చర్చించి ఆమోదం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో భూ ఆక్రమణల నిరోధక చట్టం-1982 (ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982) అమలులో ఉంది. కానీ దాని స్థానంలో ఆంధ్రప్రదేశ్‌లో భూ ఆక్రమణల నిరోధక చట్టం-2024 శాసనసభలో ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పాత చట్ట స్థానంలో కొత్త చట్టం తేవడానికి చాలా బలమైన కారణమే ఉంది. ఎప్పుడో 40 ఏళ్ళ క్రితంనాటి పరిస్థితులకు అనుగుణంగా చేసిన ఆ పాత చట్టంలో అనేక లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగులను ఉపయోగించుకొని గత 5 ఏళ్ళ జగన్ పాలనలో రాష్ట్రంలో విచ్చలవిడిగా భూకబ్జాలు జరిగాయి.
కానీ వారిని, వారు కబ్జా చేసిన భూములను గుర్తించి స్వాధీనం చేసుకోవడానికి, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి పాత చట్టం ప్రకారం సాధ్యం కాదు.
రాష్ట్రంలో నానాటికీ భూముల ధరలు పెరిగిపోతున్నందున భూకబ్జాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కనుక వాటిని అడ్డుకొని నేరస్తులపై కటిన చర్యలు తీసుకోవడానికి మరింత బలమైన చట్టం అవసరం ఉందని ప్రభుత్వం భావించింది. కొత్త చట్టం ప్రకారం భూకబ్జా చేసిన్నట్లు నేరం రుజువైతే కనీసం 7 నుంచి 11 ఏళ్ళు జైలుశిక్షతో పాటు భారీగా జరిమానా కూడా విదించవచ్చు. ఆక్రమిత భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకొనేందుకు అవసరమైన అంశాలు కొత్త చట్టంలో చేర్చారు.
ఈ నెల 11 నుంచి జరుగబోయే శాసనసభ సమావేశాలలో ముందుగా 1982 నాటి పాత చట్టాన్ని ఉపసంహరించుకొని, దాని స్థానంలో ఈ కొత్త చట్టాన్ని ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే దానికి మంత్రివర్గ సమావేశంలో నేడు ఆమోదముద్ర వేశారు. ఈ చట్టం అమలులోకి వస్తే ముందుగా భూకబ్జాలు చేసిన వైసీపి నేతల మెడలకు ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంటుంది.




