హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా గురువారం నుంచి బోనాలు ఉత్సవాలు మొదలయ్యాయి. తొమ్మిది రోజుల పాటు నగరంలో అమ్మవారి ఆలయాలలో సాగే ఈ బోనాల ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు, ముఖ్యంగా మహిళలు వచ్చి అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పిస్తారు. తెలంగాణలో రెండేళ్ళకోసారి జరిగే సమ్మక్క సారక్క మహా జాతరకు సుమారు కోటి మంది భక్తులు వస్తుంటారు.
మరోవైపు నేడు పూరీలో కన్నుల పండుగలా జగన్నాధస్వామి రధయాత్ర జరుగుతోంది. ఈ జగన్నాధ రధయాత్రలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి సుమారు 12-15 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో జరుగుతున్న ఈ రెండూ ఉత్సవాలు యావత్ దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
ఆంధ్రాలో కూడా పండుగలు, పబ్బాలు జరుగుతూనే ఉంటాయి. హైదరాబాద్‌తో సహా ఇతర రాష్ట్రాలకు ఉద్యోగాలు, ఉపాధి, చదువుల కోసం వెళ్ళినవారు సంక్రాంతి పండుగకు తప్పక ఆంధ్రకి వస్తుంటారు. సంక్రాంతి-కోడి పందాలు, సినిమాలు ఆ ముచ్చట్లు ఎంత చెప్పుకున్నా తరిగేవి కావు. ప్రతీ 12 ఏళ్ళకు ఓసారి జరిగే కృష్ణాగోదావరి పుష్కరాలకు లక్షల మంది తరలివస్తుంటారు.
అయితే తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఒడిశా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో జరిగే ఇటువంటి భారీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉత్సవాలతో పోలిస్తే ఆంధ్రాలో జరుగుతున్నవి చాలా తక్కువని చెప్పక తప్పదు.
నిజానికి ఆంధ్రాలో పర్యాటక ఆకర్షణ కేంద్రాలకు కొదవలేదు. కానీ ఇంతకాలం పర్యాటక రంగాన్ని పట్టించుకోకపోవడం వలన ఆంధ్రాకు రావలసినంత గుర్తింపు రాలేదు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు పర్యాటక రంగం అభివృద్ధి చేసేందుకు అనేక ప్రణాళికలు సిద్దం చేసి అమలుచేస్తోంది కనుక వాటి ఫలితాలు రాబోయే ఏళ్ళలో కనిపించవచ్చు.
కానీ తెలంగాణలో సమ్మక్కసారక్క జాతర, పూరీలో జగన్నాధ రధయాత్ర, ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా, కేరళలో ఓణం వంటి భారీ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.
అందుకు తగిన పండుగలు, పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలు, వనరులు అన్నీ ఆంధ్రాకు పుష్కలంగా ఉన్నాయి కూడా. కనుక యావత్ ప్రపంచ దేశాలను కాకపోయినా కనీసం యావత్ దేశప్రజల దృష్టిని ఆకర్షించగల భారీ ఉత్సవాలు నిర్వహించగలిగితే ఆంధ్రప్రదేశ్‌కి మరింత గుర్తింపు లభిస్తుంది.




