వచ్చే ఎన్నికలలో 175 సీట్లు గెలుచుకొని మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని సిఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికల తర్వాత ఆయన మళ్ళీ జైలు జీవితం గడపబోతున్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం జగ్గయ్యపేట రోడ్ షోలో చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులను వాస్తవ దృష్టితో చూసినట్లయితే కొన్ని విషయాలు అర్దమవుతాయి.
1.వైసీపీకి ఓట్లు వేస్తారనే నమ్మకం ఉన్నవారికే సంక్షేమ పధకాలు ఇస్తోంది. కనుక వారందరూ తప్పక తమ పార్టీకే ఓట్లు వేస్తారని వైసీపీ గట్టి నమ్మకంతో ఉంది. అది సాధ్యమే అని భావించవచ్చు.
2.లక్షల మందితో వైసీపీ సృష్టించుకొన్న వాలంటీర్ల వ్యవస్థ ద్వారా లబ్దిదారులపై నిఘా పెడుతూ వారు టిడిపి, జనసేనలవైపు వెళ్ళకుండా కాసుకొంటోంది. కనుక సంక్షేమ పధకాలు ఇస్తున్న వైసీపీని కాదని టిడిపి, జనసేనలకు ఎందుకు ఓట్లు వేయాలో ఆ రెండు పార్టీలే చెప్పుకోవలసి ఉంటుంది. లబ్దిదారులను టిడిపి, జనసేనలు ఏమేరకు ఆకట్టుకోగలవనే దానిపైనే వాటి విజయావకాశాలు ఉంటాయి.
3.వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రంలో టిడిపి, జనసేన మూలాలను దెబ్బతీయడం ద్వారా ప్రజలకు వేరే ప్రత్యామ్నాయం లేకుండా చేయాలనే మరో ఆలోచన కూడా కనబడుతోంది. ఆ ప్రయత్నంలోనే ఇటు ఉత్తరాంద్ర, అటు రాయలసీమలో మూడు రాజధానుల పేరుతో ఉద్యమాలు చేయిస్తూ, అమరావతి చుట్టుపక్కల జిల్లాలో కులాల కుంపట్లు రగిలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు భావించవచ్చు. తద్వారా టిడిపి, జనసేన నేతలు రాష్ట్రంలో ఎక్కడా తిరగలేని పరిస్థితులు కల్పించాలని వైసీపీ ప్రయత్నిస్తున్నట్లుంది. పవన్ కళ్యాణ్‌ని విశాఖలో పర్యటించనీయకుండా అడ్డుకొని వెనక్కు తిప్పి పంపడం, నిన్న చంద్రబాబు నాయుడుపై రాళ్ళ దాడులు ఇందుకు తాజా నిదర్శనాలు.
4.నగరాలలో, పట్టణాలలో ఓటర్లలో విద్యావంతులు, రాజకీయ చైతన్యం ఉన్నవారు ఎక్కువగా ఉంటారు కనుక వైసీపీ అరాచకాలను చూస్తున్న వారు టిడిపి, జనసేనలవైపే మొగ్గు చూపడం ఖాయం. కానీ పొత్తుల విషయంలో ఆ రెండు పార్టీల మద్య నెలకొన్న సందిగ్ధత ఇంకా ఇదేవిదంగా కొనసాగితే పట్టణ ఓటర్లలో కూడా చీలికలు ఏర్పడి రెండూ నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
5.గోడ మీద పిల్లిలా కూర్చొని చూస్తున్న బిజెపికి రాష్ట్రంలో బలం లేనప్పటికీ దాని వెనుక అత్యంత శక్తివంతమైన కేంద్ర ప్రభుత్వం ఉంది గనుక అది తీసుకోబోయే రాజకీయ నిర్ణయాలు కూడా ఈ మూడు పార్టీలను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు.
6.ఇవి కాక తెలంగాణ సిఎం కేసీఆర్ మళ్ళీ ఏపీ ఎన్నికలలో వేలుపెడితే అదీ… వైసీపీ, టిడిపి, జనసేనల పరిస్థితిని తారుమారు చేయగలదు.
ఇదీ… వాస్తవ పరిస్థితి. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షపార్టీల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరులో ఈ అంశాలను ఏ పార్టీ తనకు అనుకూలంగా మలుచుకోగలదనే దానిపైనే వాటి విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.



