రాజకీయాలు ఎల్లకాలం ఒకేలా సాగవు. ఓడలు బళ్ళవుతాయి… బళ్ళు ఓడలవుతాయి. నేడు శాసనసభ మండలిలో ఇది మరోసారి నిరూపితమైంది.
ఇటీవల శాసనసభ సమావేశాలలో కూటమి సభ్యులలో కొందరు మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశ్యించి ‘పులివెందుల ఎమ్మెల్యే’ అని సంభోదించారు. ఇది వాస్తవమే కానీ ‘మాజీ ముఖ్యమంత్రి జగన్’ అని సంభోదిస్తే గౌరవంగా హుందాగా ఉండేది. రాజకీయాలలో ఇటువంటి హుందాతనం పాటిస్తే అదే సత్సాంప్రదాయంగా కొనసాగుతుంది.
కానీ కూటమి సభ్యులు తమ అధినేత పట్ల చులకనగా మాట్లాడారు కనుక వైసీపీ కూడా ఇందుకు మండలి సమావేశంలో నేడు ప్రతీకారం తీర్చుకుంది. వైసీపీ ఎంపీ రమేష్ యాదవ్ సభలో సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో సిఎం చంద్రబాబు నాయుడు విఫలం అయ్యారని చెప్పేబదులు ‘కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు’ మాట తప్పారని విమర్శించారు.
దీనిపై టీడీపి సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. అలా చెపుతారని రమేష్ యాదవ్ ముందే ఊహించారు. కనుక తెలివిగా కుప్పం నియోజకవర్గం అభివృద్ధి గురించి మాట్లాడటం మొదలుపెట్టి ఆనాడు ‘కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నాయుడు’ అనేక హామీలు ఇచ్చారని కానీ అమలుచేయలేదని విమర్శించారు.
దీనిపై టీడీపి సభ్యులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే సీనియర్ వైసీపీ నేత, మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ లేచి మీవాళ్ళు మా అధినేత జగన్మోహన్ రెడ్డికి మర్యాద ఇవ్వకుండా ‘పులివెందుల ఎమ్మెల్యే’ అంటూ సంభోదించడం తప్పుకానప్పుడు ఇదెలా తప్పవుతుందని ఎదురు ప్రశ్నించారు.
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాటలు రికార్డులలో నుంచి తొలగించాలని మంత్రులు పట్టుబట్టారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. అనంతరం వైసీపీ ఎమ్మెల్సీ బయట మీడియాతో మాట్లాడుతూ, “కూటమి సభ్యులు మా అధినేత జగన్మోహన్ రెడ్డిని ‘పులివెందుల ఎమ్మెల్యే’ అని సంభోదిస్తే ఇకపై మేము కూడా ముఖ్యమంత్రి, మంత్రులను కుప్పం, మంగళగిరి, పిఠాపురం ఎమ్మెల్యేలనే సంభోదిస్తాము,” అని స్పష్టం చేశారు.
కనుక వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ నేడు సభలో యాదృచ్చికంగా ఈవిదంగా మాట్లాడలేదని, కూటమి సభ్యులకు ధీటుగా జవాబు చెప్పాలనే ఈవిదంగా మాట్లాడారని స్పష్టమవుతోంది. కానీ శాసనసభ, మండలి సమావేశాలలో ఇటువంటి అనవసరమైన విషయాలు మాట్లాడటం, ఒకరినొకరు కించపరుచుకోవడం అవసరమా?





