ఆంధ్రప్రదేశ్ లోని పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా మారుస్తూ నోటిఫికేషన్ జారీచేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 26 జిల్లాల లిస్టులో ఎన్టీఆర్ జిల్లా కూడా ఒకటి. ఈ ప్రకటన వచ్చినప్పటి నుండి జగన్ రాజకీయాలకు అతీతంగా పాలిస్తున్నారు అంటూ పీఆర్ క్యాంపెయిన్ మొదలుపెట్టేశారు.
తాజాగా ఎన్టీఆర్ కుటుంబం, తెలుగుదేశం పార్టీ, జూనియర్ ఎన్టీఆర్ దీని మీద స్పందించలేదని… జగన్ కు థాంక్స్ చెప్పలేదని ప్రచారం మొదలుపెట్టారు. టీడీపీ విషయం పక్కన పెడితే… ఎన్టీఆర్ కుటుంబానికి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీనే ముఖ్యమా? తండ్రికి అంతటి గౌరవం ఇస్తే కనీసం థాంక్స్ చెప్పారా? అంటూ తిట్టి పోస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ని అయితే చంద్రబాబు సతీమణిని ఏదో అంటే స్పందించావు… మీ తాతకు ఇంత చేస్తే స్పందించవా అంటూ తిట్లు తిడుతున్నారు. సరే ఎన్టీఆర్ జిల్లా పేరిట ఎంతో రాజకీయ లబ్దిని ఆశించిన జగన్ పార్టీకి వారు స్పందించకపోవడం నిరాశ కలగడం మాములే.
అయితే తమ రాజకీయ ప్రయోజనాలకు ప్రత్యర్ధులు కూడా సహకరించాలి అనుకోవడం అత్యాశే. ఆ విషయం కూడా పక్కన పెడితే 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాలమరణంతో ఆ తరువాత అధికారంలోకి రోశయ్య కడప జిల్లాకు వైఎస్సార్ పేరు పెట్టారు. అప్పుడు జగన్ గానీ, వైఎస్ కుటుంబీకులు గానీ రోశయ్యకు థాంక్స్ చెప్పలేదు.
ఎందుకు చెప్పలేదు అంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసం చేసిందని సమర్ధించుకున్నారు. కాంగ్రెస్ కు రాజకీయ లబ్ది కలిగితే అది రాజకీయంగా ఎదగాలి అనుకునే జగన్ మోహన్ రెడ్డి కి ఇబ్బంది కాబట్టి థాంక్స్ చెప్పలేదు. ఇప్పుడు టీడీపీ గానీ, ఎన్టీఆర్ కుటుంబంకు గానీ అదే వర్తిస్తుంది కదా?



