ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ హడావుడి మామూలుగా ఉండదు. అయితే ఈసారి మరింత ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహించడమే కాకుండా, సిఎం చంద్రబాబు నాయుడు మొదలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు అందరూ ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. స్వయంగా పాల్గొంటున్నారు.
సంక్రాంతి పండుగ అంటే మొట్ట మొదట గుర్తుకొచ్చేది కోడి పందాలే. ఈసారి మరింత జోరుగా సాగుతున్నాయి. అయితే ఈసారి సంక్రాంతి పండుగకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో పడవ పందాలు నిర్వహించి కొత్త వేడుకని జోడించారు.
మంత్రి నారా లోకేష్‌తో సహా పలువురు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ “ఇది కేరళ బోట్ రేసు ఫోటో కాదు కోనసీమలో పడవల పోటీ,” అని పెడుతుండటం గమనిస్తే ఈ ఒకే ఒక్క ఈవెంట్ ఎంత పాపులర్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.
ఉదాహరణకు ఒకప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ అన్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు కేబిల్ బ్రిడ్జ్, ఐటీ సిటీ, బహుళ అంతస్తుల భవనాలు వంటి అనేక ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తూ హైదరాబాద్‌కి కొత్త గుర్తింపునిస్తున్నాయి.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా రాష్ట్రంలో విస్తారంగా ఉన్న ఇటువంటి సహజ వనరులను, పర్యాటక ఆకర్షణ కేంద్రాలను, ఇటువంటి పండుగలు పబ్బాలను జోడిస్తూ తెలివిగా ఉపయోగించుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది కదా?
ఆత్రేయపురంలో నిర్వహించిన పడవ పందేలు ఇంత వైరల్ అవుతున్నప్పుడు, పర్యాటక రంగాన్ని సమర్ధంగా ఉపయోగించుకుంటే యావత్ దేశంలో ఆంధ్రప్రదేశ్ పేరు మారుమ్రోగడం ఖాయం. పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు, అభివృద్ధితోనే సరిపెట్టుకోకుండా పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడం కష్టమా? పాలకులు, అధికారులు ఆలోచించాలి.
This is not #Kerala. This is #Athreyapuram in #AndhraPradesh. Festive vibe hits an all time high!
Happy #Sankranthi!! pic.twitter.com/O3pNzejdyE— Lokesh Nara (@naralokesh) January 15, 2026






