మహారాష్ట్ర నుంచి తెలంగాణ రాష్ట్రం మీదుగా గోదావరి నది ప్రవహించి ఆంధ్రాకు చేరుకుంటుంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలు వాడుకోగా మిగిలిన నీళ్ళన్నీ సముద్రంలో కలుస్తుంటాయి.
అలాగే కర్ణాటక నుంచి కృష్ణానది తెలంగాణ మీదుగా ఆంధ్రాకు చేరుకుంటుంది. మిగిలిన నీళ్ళన్నీ సముద్రంలో కలుస్తుంటాయి.
కనుక సముద్రంలో వృధాగా కలిసిపోతున్న ఈ మిగులు నీటిని కరువు పీడిత రాయలసీమ జిల్లాలకు, అటు ఉత్తరాంధ్ర జిల్లాలకు అందించాలని, దీని కోసం కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేయాలనే సిఎం చంద్రబాబు నాయుడు ఆలోచన చాలా హర్షణీయం.
ఆంధ్రాలో వైసీపీ శవ రాజకీయాలు చేస్తున్నట్లుగానే, తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నీళ్ళ రాజకీయాలు చేస్తుంటుంది. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ నీటిని తరలించుకుపోతుంటే సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన్నట్లు చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చొందని విమర్శిస్తోంది.
అదే.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆంధ్రా పాలకుల నీటి దోపిడినీ అడ్డుకుంటూ తెలంగాణ రాష్ట్రం, రైతుల ప్రయోజనాలు కాపాడేవారని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు తదితరులు ఆరోపిస్తున్నారు.
అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టి బిఆర్ఎస్ పార్టీ రాజకీయంగా పైచేయి సాధించాలని ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతోంది.
బిఆర్ఎస్ పార్టీ ఆలోచనలని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గ్రహించింది. కనుక ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ జగన్‌తో కుమ్మకు అవడం వలననే పట్టించుకోకుండా వదిలేశారని, అందువల్లే ఆంధ్రా ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుని నిర్మించుకోగలుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని అందువల్లే రాయలసీమ ప్రాజెక్టుకి బ్రేకులు పడ్డాయన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై కూడా సుప్రీంకోర్టులో కేసు వేసి అడ్డుకుంటామని చెప్పారు.
అంటే తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో బిఆర్ఎస్ పార్టీ కంటే తమకే ఎక్కువ చిత్తశుద్ధి ఉందని చెప్పుకుంటున్నారన్న మాట!తద్వారా బిఆర్ఎస్ పార్టీపై రాజకీయంగా పైచేయి సాధించాలనుకుంటున్నారన్న మాట!
తెలంగాణలో బీజేపి కూడా ప్రతిపక్షంలో ఉంది. కానీ అది ఏపీలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుల గురించి పెద్దగా మాట్లాడదు. కారణం అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు మాత్రం పరస్పరం రాజకీయంగా పైచేయి సాధించడానికే ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో యుద్ధాలు చేసుకుంటున్నాయని అర్దమవుతోంది.
బిఆర్ఎస్ నీళ్ళ రాజకీయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కోలేకపోతే రాజకీయంగా నష్టపోతుంది. కనుక అది కూడా నీళ్ళ కోసం ఆంధ్రాతో కయ్యానికి కాలు దువ్వక తప్పడం లేదు.
కనుక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, బిఆర్ఎస్ పార్టీ ఆంధ్రాలో కృష్ణా నదిపై నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పదకాన్ని, తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరిపై బనకచర్ల సాగునీటి ప్రాజెక్టుని తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఏపీలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తే ఎగువనున్న తెలంగాణకు, రైతులకు నష్టం కలుగుటుందంటే తప్పకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్రాల సాగునీటి అధికారులు కూర్చొని మాట్లాడుకొని సమస్యని పరిష్కరించుకోవలసిందే.
కానీ తెలంగాణ కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు నీళ్ళ పేరుతో ఆధిపత్యపోరు చేసుకుంటూ, మద్యలో ఆంధ్రాని లాగడాన్ని ఎవరూ హర్షించలేరు.




