
మంత్రి కాకణి గోవర్దన్ రెడ్డి, తాజా మాజీ అనిల్ కుమార్‌లను సిఎం జగన్మోహన్ రెడ్డి నిన్న తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిచి తలంటిన తరువాత మంత్రి కాకణి మీడియాతో మాట్లాడుతూ, “నేను మిమ్మల్ని కలవాల్సిన అవసరమే లేదు. కానీ కలవకుండా వెళ్ళిపోతే, సిఎం జగన్మోహన్ రెడ్డి నాకు చీవాట్లు పెట్టారని అందుకే మొహం చాటేసి వెళ్ళిపోయారంటూ ఏవేవో కట్టుకధలు వ్రాస్తారు. అందుకే మీతో మాట్లాడుతున్నాను తప్ప లేకుంటే మీతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. మీరనుకొన్నట్లు లోపల అటువంటిదేమీ జరుగలేదు. నెల్లూరు జిల్లా అభివృద్ధి పనుల గురించి చర్చించాము. ఇద్దరం కలిసి పనిచేసుకోవాలని సిఎం జగన్ సూచించారు. అంతే!
మా ఇద్దరి మద్య ఎటువంటి విభేధాలు లేవు. కానీ నిప్పు లేకపోయినా పొగ రాజేసే మీడియా ఇటువంటి పుకార్లు పుట్టించింది. ‘అనిల్ అనే వ్యక్తి’తో మేము అధికారంలో లేనప్పుడు కలిసి పనిచేశాను. ఇప్పుడు చేస్తాను. మేము ఎప్పుడూ కూడా పార్టీ బాగుండాలని కోరుకొంటాము తప్ప ‘నీడ నిచ్చే చెట్టును నరుక్కొనే మూర్కులం కాము.’ నా ఫ్లెక్సీలు ఆయన చింపలేదు. నేను ఆయనవి చింపలేదు. మా మద్య గ్యాప్ పెంచడానికే మీడియా, కొన్ని సంఘవిద్రోహ శక్తులు ఈ పుకార్లు పుట్టించాయి.
ఆయన సభలకు నేను, నా సభలకు అనిల్ హాజరవుతారా లేదా?అనేది ముఖ్యం కాదు. ఎవరు సభలు, పార్టీ కార్యక్రమాలు నిర్వహించినా వీలును బట్టి హాజరవుతుంటాము. ఆరోజు ఆయన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొన్నాడు కనుకనే నా సభకు రాలేకపోయాడు. ఒకేసారి రెండు చోట్ల హాజరుకాలేడు కదా? అని మంత్రి కాకణి అన్నారు.
ఆ తరువాత వేరేగా మీడియాతో మాట్లాడిన అనిల్ కుమార్ కూడా తమ మద్య ఎటువంటి విభేధాలు లేవని చెపుతూనే “నేను మూడేళ్ళు మంత్రిగా పనిచేశాను. ఇప్పుడు కాకణి చేస్తారు. తరువాత మళ్ళీ మా 14 మంది మంత్రులవుతాము” అని చెప్పడం విశేషం. ఫ్లెక్సీలు గాలికి చిరిగిపోయినా, మునిసిపల్ సిబ్బంది తొలగించినా కూడా మీడియా దానిపై కట్టుకధలు అల్లేస్తోందని అనిల్ అన్నారు.
అనిల్‌తో విభేధాలు లేవంటూనే అతనితో తనకు పరిచయం లేనట్లు ‘అనిల్ అనే వ్యక్తి’తో కలిసి పనిచేశానని మంత్రి కాకణి చెప్పడం, అనిల్‌ని ఉద్దేశ్యించి ‘నీడనిచ్చే చెట్టును నరుక్కొనే మూర్కులం కామంటూ’ అనడం, ‘అనిల్ సభలకు వెళ్తారా?’ అని విలేఖరులు అడిగినప్పుడు తప్పకుండా వెళ్తానని చెప్పకుండా సమాధానం దాటవేయడంవంటివన్నీ వారిద్దరి మద్య విభేధాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పకనే చెపుతున్నాయి. కానీ తమ మద్య గ్యాప్ సృష్టిస్తోందని మీడియాను నిందించడం విశేషం. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కాకణి తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ, ‘అసలు మీడియాతో మాట్లాడవలసిన అవసరమే లేదు,” అనడం విస్మయం కలిగిస్తుంది.
అనిల్ కుమార్ కూడా “ఇప్పుడు ఆయన మంత్రి అయ్యారు తరువాత నేను అవుతానంటూ” చెప్పడం కాకణిని తనతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యాలే అని వేరే చెప్పక్కరలేదు.
ఇద్దరికీ జగన్ చీవాట్లు పెట్టిన తరువాత కూడా మీడియా ఎదుటే ఒకరి గురించి మరొకరు ఈవిదంగా చురకలు వేసుకొని అగ్గి రాజేసుకొంటూ, నిప్పు లేకపోయినా మీడియా పొగ రాజేస్తోందని మీడియాను నిందించడం దేనికి?అయినా మీడియా రాయకపోతే వారిద్దరూ సఖ్యతగా ఉండేవారా…ఉంటారా?



