ఆంధ్రప్రదేశ్ లో మహిళల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, అసలు స్వేచ్ఛగా మహిళలు బయటతిరిగే పరిస్థితే లేదని, ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా అంటూ ఏపీ టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు.
తన అధికార దాహం కోసం, డబ్బు సంపాదన యావతో కన్నతల్లిని, సొంత చెల్లితో పాటు బాబాయి కూతురైన మరో చెల్లిని మెడబట్టుకుని బయటకు గెంటేసిన వ్యక్తి జగన్ అని అనిత ఘాటు విమర్శలు చేశారు. అలాంటి మనస్థత్వం ఉన్న జగన్ ఆంధ్రప్రదేశ్ లో ఆడవారి గురించి, వారి అభ్యున్నతి గురించి ఆలోచన చేస్తారనే ఆలోచన కూడా అనవసరం అని అనిత అన్నారు.
ఒక్క ఛాన్స్ అన్నందుకు అధికారం ఇస్తే మహిళల జీవితాలు అయోమయంలో పడ్డాయని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కీచక పాలన జరుగుతుందని, ఈ కీచక పాలనలో మహిళలపై ప్రతీ 8 గంటల వ్యవధిలో ఒక అఘాయిత్యం జరుగుతుందని, సగటున రోజుకి 3 అఘాయిత్యాలు జరుగుతున్నాయని, కీచక పాలనకు ఇది నిదర్శనం కాదా అని అనిత అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుండి 15 లక్షల మేర వడ్డీలేని రుణాలు మంజూరు అవుతున్నాయని, ఆ సొమ్మును జగన్ ఏమి చేస్తున్నారని అనిత ప్రశ్నించారు. ఆడదాని సొమ్ము తిన్నవారు బ్రతికి బట్ట కట్టిన దాఖలాలు లేవని, ఆడవారికి సహకారంగా సొమ్మును ఇవ్వాల్సింది పోయు వారి నుండి లాక్కుని తినే పరిస్థితుల్లో జగన్ ఉన్నారంటే రాష్ట్రం ఎలాంటి పరిస్ధితుల్లో ఉందో ప్రజలు అర్ధం చేసుకోవాలని అనిత అన్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న జగన్ రాక్షస పాలనను అంతమొందించాలంటే మహిళలందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని, మహిళలందరూ ఐక్యంగా పోరాటం చేయడానికి సిద్ధం కావాలని మహిళలకు అనిత పిలుపునిచ్చారు.



