అయోధ్య రామాలయంలో దొంగాతనాలా.. హవ్వ!

Ayodhya Ram Temple theft investigation

అయోధ్యలోని శ్రీరామ మందిరం కోట్లాది హిందువుల విశ్వాసానికి, దశాబ్దాల పోరాటానికి ప్రతీక. అయోధ్య బాలరాముడిని నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకొంటారు. యధాశక్తిన నగదు, కానుకలు సమర్పించుకుంటారు. దేశ విదేశాలలోని భక్తులు కూడా ఆన్‌లైన్‌ ద్వారా విరాళాలు అందజేస్తుంటారు.

అలాంటి ఆలయంలో భక్తులు సమర్పించిన విరాళాలు, బంగారం, వెండి ఆభరణాల కానుకలు దొంగతనాలు జరుగుతుండటం చాలా భాధాకరం.

ADVERTISEMENT

బయట వ్యక్తులు ఎవరూ దొంగతనాలు చేయకుండా నివారించేందుకు ఆలయంలో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే, ఆలయ సిబ్బందే వాటి కళ్ళు గప్పి దొంగతనాలకు పాల్పడుతుండటం దిగ్బ్రాంతి కలిగిస్తుంది.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం హుండీ కానుకల లెక్కించే చోట డ్యూటీలో ఉన్న కొందరు ఉద్యోగులు, సీసీ కెమెరాలకు అడ్డుగా నిలబడగా మరికొందరు దుస్తులలో నగదు, వెండి, బంగారు ఆభరణాలను బయటకు తరలించినట్లు గుర్తించింది.

ఆలయంలో జరిగిన దొంగతనాలు, హుండీ విరాళాల లెక్కింపులో అవకతవకలకు పాల్పడిన పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. వారికి సహకరించిన మరో ఎనిమిది మందిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు.

దేశవ్యాప్తంగా తిరుమల, వైష్ణోదేవి, సిద్ధివినాయక్, అనంత పద్మనాభస్వామి, షిరిడి సాయి వంటి వందలాది ప్రముఖ దేవాలయాలు దశాబ్దాలుగా భారీ విరాళాలు, బంగారం, వెండి ఆభరణాలను అత్యంత భద్రంగా నిర్వహిస్తున్నాయి. ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థలు, కఠిన ఆడిట్ విధానాలతో అవకతవకలకు అవకాశం లేకుండా చేస్తున్నాయి.

అటువంటి సుప్రసిద్ద ఆలయాలలో ఒకటిగా నిలిచిన అయోధ్య రామాలయంలో అంతర్గత భద్రత, నిర్వహణ, నియంత్రణ వ్యవస్థలను నిర్వీర్యం చేసి దొంగతనాలు చేస్తుంటే ఆలయ ట్రస్ట్, యూపీ ప్రభుత్వం ఏం చేస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ ఈ కేసుని స్వయంగా పర్యవేక్షించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినట్లు దర్యాప్తులో తెలినప్పుడే దేశంలో హిందువులు బాధ పడ్డారు. అలాంటిది కొత్తగా నిర్మించిన అయోధ్య రామాలయంలో అప్పుడే ఈ స్థాయిలో దొంగతనాలు, అవకతవకలు జరుగుతుండటం హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నాయి. ఇకనైనా ఇటువంటి అపచారాలు జరుగకుండా యోగీ సర్కార్ తగిన చర్యలు తీసుకుంటే మంచిది.

ADVERTISEMENT
Latest Stories