ap-and-telangana-bjp-presidents-changed

రెండు తెలుగు రాష్ట్రాలలోని బీజేపీ తన పార్టీ రాష్ట్ర అధ్యక్షులను మారుస్తూ కొత్తవారికి అవకాశాన్ని కల్పించే ప్రక్రియ చేపట్టింది. ఇందుకు గాను బీజేపీ పార్టీలోని ముఖ్య నేతలు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ఈటెల, అరవింద్, డీకే అరుణ వంటి సీనియర్ నాయకులతో పాటుగా రాజా సింగ్ కూడా అధ్యక్ష రేసులో తానూ ఉన్నాను అంటూ ప్రకటనలు ఇస్తున్నారు. అయితే వీటన్నిటికీ భిన్నంగా మీడియాలో ప్రచారం లేని పేరు ఒకటి బీజేపీ అధిష్టానం తెర మీదకు తెచ్చింది.

Also Read – ట్రంప్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి!

బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరును బీజేపీ అధిష్టానం ఫైనల్ చేసినట్టు సమాచారం. అయితే గతంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికారిక ప్రతినిధిగా, బీజేపీ న్యాయ విభాగంలో చురుకుగా పని చేసిన నాయకుడిగా రామ్ చందర్ కు మంచి గుర్తింపు ఉంది. ఈయన బ్రాహ్మణ సామజిక వర్గానికి చెందిన నాయకుడు.

ఇక ఏపీ విషయానికొస్తే, ఉత్తరాంధ్రకు చెందిన PVN. మాధవ్ పేరును ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా పని చేసిన అనుభవం మాధవ్ కు ఉంది. అలాగే గతంలో మాధవ్ తండ్రి పీవీ చలపతి రావు కూడా ఆరేళ్లపాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగారు.

Also Read – గులక రాయి తగలడం వల్లనే జగన్‌కి మతిమరుపు?

అయితే ఇటు ఏపీలో ఈ అధ్యక్ష పదవి పై సీనియర్ నాయకుల పేర్లు వినిపించినప్పటికీ అధిష్టానం మాధవ్ వైపే మొగ్గుచూపింది. అయితే ఈసారి మాధవ్ ఎంపికతో బీజేపీ బీసీ వర్గానికి ప్రాధాన్యం అందించింది. దీనితో ఏపీలో పురందరేశ్వరి స్థానాన్ని PVN మాధవ్, తెలంగాణలో కిషన్ రెడ్డి స్థానాన్ని రామ్ చందర్ రావు దక్కించుకున్నట్టయ్యింది.

ఇటు తెలంగాణ, అటు ఏపీ రెండు రాష్ట్రాలలోను ఈసారి బీజేపీ తన పార్టీ అధ్యక్షుల ఎంపికలో వినూత్నంగా ఆలోచించి ముందుకెళ్లింది. మీడియా ప్రచారానికి దూరంగా, ప్రజలలో ఆదరణ లేనివారిని, క్షేత్ర స్థాయిలో దూకుడుగా వ్యవహరించని వారిని బీజేపీ అధిష్టానం ముందుకు తీసుకురావడంతో బీజేపీ మద్దతుదారులతో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది.

Also Read – మిథున్ రెడ్డి: కోటరీ కట్టుబాట్లు పాటిస్తారా.?

ఏపీలో కూటమి పొత్తులో భాగమైన బీజేపీ రాష్ట్రంలో సొంతంగా బలపడేందుకు అవకాశం లేదు, కానీ తెలంగాణలో బీజేపీ దూకుడుగా వ్యవహరించగలిగితే అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం లేకపోలేదు. బిఆర్ఎస్ రాజకీయ క్రీడలో నలిగిపోయిన ఈటెల రాజేంద్ర ప్రసాద్ వంటి వారికీ బీజేపీ అవకాశం ఇచ్చి ఉంటే బీజేపీ అధికారం దిశగా మరోమెట్టు ఎక్కినట్టు అయ్యేది అనే అభిప్రాయం గట్టిగా వినిపడుతుంది.




అలాగే గతంలో బండి సంజయ్ హయాంలో తెలంగాణ బీజేపీ దూకుడుగా వ్యవహరించడంతో బండి కి బీజేపీ అధిష్టానం మరో ఛాన్స్ ఇస్తుంది అనుకున్న బీజేపీ క్యాడర్ కు రామ్ చందర్ ఎంపిక ఒక రకమైన షాక్ కు గురి చేసిందనే చెప్పాలి. మరి బీజేపీ అధిష్టాన వినూత్న నిర్ణయాలు పార్టీకి ఆశించిన ఫలితాలు అందిస్తాయా.?