ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 7 వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఈ శనివారమే (ఫిభ్రవరి 14) ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ఈ నెల 15వ తేదీ ఆదివారం, 16న మహాశివరాత్రి కనుక ఆ రెండు రోజులు శాసనసభ సమావేశాలకు సెలవు. మళ్ళీ ఈ నెల 17, 18 తేదీలలో సమావేశమై బడ్జెట్ మీద చర్చిస్తారు. సభ్యులు, వివిధ శాఖల మంత్రులు అడిగిన ప్రశ్నలకు ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ 18న సమాధానాలు ఇస్తారు.
ఫిభ్రవరి 24, 25,26 తేదీలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహిస్తారు. మార్చి 6వ తేదీన అమరావతిలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. మార్చి 1,2,3 తేదీలలో శాసనసభ సమావేశాలకు సెలవు ప్రకటించారు. కనుక మార్చి 7 వరకు మొత్తం 17 రోజులు సమావేశాలు కొనసాగుతాయి. అవసరమైతే మరికొన్ని రోజులు పొడిగించాలని నిర్ణయించారు.
ఏపీ రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు వంటి పలు భారీ ప్రాజెక్టులు వివిధ దశలలో ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అమరావతికి నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. కనుక రాష్ట్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చుకొని బడ్జెట్‌లో ప్రకటించాల్సి ఉంటుంది.
తాజాగా విశాఖ మెట్రో కారిడార్ నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ దానికీ వివిధ అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రభుత్వం అప్పుల రూపంలో నిధులు సమకూర్చుకుందని గతంలో వార్తలు వచ్చాయి. కనుక బడ్జెట్‌లో దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఈయాల్సి ఉంటుంది.
ఇంకా రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలు ఏర్పాటు కాబోతున్నాయి. కనుక ప్రభుత్వం వాటిపై కూడా ఈ సమావేశాలలో చర్చించి స్పష్టత ఈయాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం, అక్కడి పార్టీలు ఏపీ ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. వాటికి వైసీపీ దాని సొంత మీడియా వంత పాడుతోంది.
కనుక ఇది కేవలం వాటి రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న రాద్ధాంతమే తప్ప తెలంగాణ ప్రయోజనాల గురించి కాదని స్పష్టమవుతోంది. కనుక ఈ ఆరోపణలపై కూడా ఏపీ ప్రభుత్వం ఈ సమావేశాలలో జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది.
ఇవి కాక రాష్ట్రాన్ని కుదిపేస్తున్న కల్తీ నెయ్యి వ్యవహారం ఉండనే ఉంది. ఈ వివాదం ఇలాగే ఎక్కువ కాలం కొనసాగితే కూటమి ప్రభుత్వానికి కూడా రాజకీయంగా ఎంతో కొంత నష్టం కలుగుతుంది.
ఒకవేళ వైసీపీ సభ్యులు, వారి అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ శాసనసభ సమావేశాల్లో పాల్గొని ఉంటే, పాలకు పాలు, నీళ్ళకు నీళ్ళు అన్నట్లు ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చి ఉండేది. కానీ రాకుండా తాడేపల్లి ప్యాలస్ నుంచి రన్నింగ్ కామెంట్రీ ఇస్తున్నారు. కనుక శాసనసభ వేదికగా జగన్ ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పడం చాలా అవసరమే.






