నాలుగున్నరేళ్ళ వైసీపి పాలనలో రంగులు, పేర్లు మార్చుకోవడం, మూడు రాజధానులు, ఒక్క రాజధాని, సంక్షేమ పధకాల డప్పుల చప్పుడు, అప్పులు, జీతాల కోసం గోల, మూడు కేసులు, ఆరు భౌతికదాడులతో ‘మా మాటే శాసనం’ అన్నట్లు పూలనావలా సాగిపోయింది.
కానీ ‘పసివాడో ఏమో ఆ పైవాడు… తను చేసిన బొమ్మలతోనే కలబడతాడు…’ అంటూ ఓ మహాకవి పాటని నిజం చేస్తున్నట్లు, ఓవైపు ఎన్నికలు ముంచుకొచ్చేస్తుంటే, ఎన్నికలలో సాయపడతాడనుకొన్న ఆ పైవాడు తన స్క్రిప్ట్ మార్చేస్తున్నాడు.
టిడిపి, జనసేనలు కలిస్తే కొంప మునుగుతుందని, వాటిని దూరంగా ఉంచాలనుకొన్న జగన్మోహన్ రెడ్డి చేతే వాటిని ఆ పైవాడు కలిపించాడు. ఎందుకైనా మంచిదని ఎన్నికలలో సులువుగా గెలిచే మార్గం కనిపెట్టి చంద్రబాబు నాయుడుతో సహా టిడిపి ముఖ్యనేతలందరినీ జైల్లో వేస్తే ‘లోపల వేసిన ఆ ఆనందం’ పూర్తిగా తీరకుండానే ఆయనను బయటకి తెచ్చేశాడు. పోనీ ఢిల్లీ వెళ్ళి పరిస్థితులు చక్కబెట్టుకొద్దామనుకొంటే, మోడీ, అమిత్ షాల మనసులు మార్చేసి వాళ్ళ అపాయింట్మెంట్స్ దొరకకుండా చేస్తున్నాడు ఆ పైవాడు!
“మేము కూడా కేసీఆర్ లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేశాం… 97% ప్రజలకు మేలు చేసేశాం. కనుక తెలంగాణ ప్రజల్లాగే, ఆంధ్రా జనాలు కూడా మావైపే ఉన్నారు… 175 సీట్లు మావే… మావే…” అని రీసౌండ్ వచ్చేలా వైసీపి అధినేత (ఒక్కరూ మాత్రమే) వాదిస్తున్నారు.
కేసీఆర్ ఫార్ములా ప్రకారమే సిట్టింగ్ ఎమ్మెల్యేలతో ఎన్నికలకు వెళ్ళిపోదామనుకొంటే, ఆ పైవాడు ‘బ్యాక్ ఫైర్’ అవుతుందని భయపెట్టేశాడు. టిడిపి నేతలను చావుదెబ్బ తీయాలనుకొంటే ఇప్పుడు ఈ భయంతో సొంత ఎమ్మెల్యేలను పీకేసుకొనేలా చేస్తున్నాడు ఆ పైవాడు! పోనీ కేసీఆర్ మళ్ళీ బ్యాక్ సపోర్ట్ ఇస్తారనుకొంటే ఆయనకే ఇప్పుడు ‘సపోర్ట్’ అవసరం పడుతోంది.
ఇంతటితో ఆగకుండా పూలనావలా సాగిపోతున్న అక్రమాస్తుల కేసులని కూడా కదిపేస్తున్నాడు ఆ పైవాడు. వాటిని విచారిస్తున్న తెలంగాణ హైకోర్టు చేత శుక్రవారం జగన్మోహన్ రెడ్డికి, సీబీఐకి నోటీసులు జారీ చేయించేశాడు. మరోపక్క సుప్రీంకోర్టుని కూడా గిల్లీ వదిలిపెట్టడంతో అది కూడా ఈ అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం చేసేందుకు సిద్దపడుతోంది.
ఇవన్నీ చూస్తుంటే… 175 సీట్లు కాదు… ఏదో కీడు జరుగబోతున్నట్లే ఉంది. బహుశః వైసీపీ నేతలకి కుడి కన్ను అదురుతున్నట్లయితే ఓసారి తమ జాతకాలు చూపించుకొంటే మంచిదేమో?
అయినా నాలుగున్నరేళ్ళుగా ఆడిందే ఆట పాడిందే పాటగా సాగనిచ్చిన ఆ పైవాడు మరో 3-4 నెలలు సాగనీయవచ్చు కదా?ఇంత తొందర ఎందుకు?
సంక్షేమ పధకాల పేరుతో లక్షల కోట్లు పంచిపెట్టేస్తున్నా ఈ జనాలకి బొత్తిగా కృతజ్ఞత ఉండదు. ఆ పైవాడినే నమ్ముకొంటే సమయానికి ఉపయోగపడటం లేదు. డామిట్! మరి ఎవరిని నమ్మాలి?




