మరో పది రోజుల్లో 2025 నుంచి 2026లోకి అందరం షిఫ్ట్ అయిపోతాము. మనతో పాటే మన రాజకీయాలు కూడా. సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఎలా ఉందో రివ్యూలు చెప్తాయి. ఏడాది ముగింపులో ఏపీలో కూటమిలో పార్టీలు, వాటి ప్రభుత్వం పని తీరు, పరిస్థితిపై ఓ రివ్యూ అవసరమే.
కూటమిలో మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి కానీ అవి ఎక్కువ కాలం కలిసి ప్రభుత్వం నడపలేవని వైసీపీ చాలా ఆశపెట్టుకుంది. కానీ దాని అంచనాలకు భిన్నంగా మూడు పార్టీలు చాలా సఖ్యంగా పనిచేస్తుండటమే కాక సంకీర్ణ ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేయాలో తెలియజేస్తున్నట్లు ఆదర్శప్రాయంగా నిలిచాయి.
కూటమి ఐక్యతకు ప్రధాన కారణం సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ పరస్పరం గౌరవించుకోవడమే.
ముఖ్యంగా డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌కు తన శాఖల నిర్వహణలో సిఎం చంద్రబాబు నాయుడు పూర్తి స్వేచ్ఛనీయడం, వాటిలో కలుగజేసుకోకుండా ఆయన శాఖలకు అడిగిన వెంటనే నిధులు కేటాయిస్తుండటం మరో కారణంగా చెప్పుకోవచ్చు. సిఎం చంద్రబాబు నాయుడు టీడీపి మంత్రులతో పాటు జనసేన, బీజేపీ మంత్రులకు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తూ వారికి మార్గదర్శనం చేస్తున్నారు.
తొలిసారిగా పదవి, అధికారం చేపట్టిన డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కూడా పాలనాపరమైన విషయాలు నేర్చుకోవడం చాలా అవసరమని గ్రహించారు. కనుక మొహమాటపడకుండా సిఎం చంద్రబాబు నాయుడు శిష్యరికంలో తనను తాను సాన పెట్టుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇద్దరూ కూడా ముఖ్యమంత్రి పదవి గురించి ఆలోచించకుండా ముందుగా సమర్థులైన మంత్రులుగా నిరూపించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు సాధిస్తూ పేరు తెచ్చుకుంటుంటే, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మారుమూల గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు.
ఇద్దరూ కూడా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే సూత్రం ఒంట బట్టించుకొని వ్యవహరిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.
సిఎం చంద్రబాబు నాయుడు ఎప్పటిలాగే చాలా దూరదృష్టితో రాష్ట్రాభివృద్ధికి గట్టిగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వ వ్యవహారాలతో అయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ నెలనెలా క్రమం తప్పకుండా రాష్ట్రంలో ఏదో ఓ జిల్లాలో పర్యటిస్తూ ప్రజలతో సంబంధాలు బలపరుచుకుంటున్నారు. ఇంత కలిసికట్టుగా పనిచేస్తూనే ముగ్గురూ తమ తమ పార్టీలను బలోపేతం చేసుకుంటూనే ఉన్నారు.
కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేనల హడావుడి ఎక్కువగా కనిపిస్తుంది కానీ బీజేపీ చాలా నిశబ్దంగా ఉండిపోవడం వల్ల అది ప్రభుత్వంలో ఉందా లేదా? అనిపిస్తుంది.
మొత్తంగా చూస్తే కూటమిలో పార్టీల మధ్య చాలా ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొని ఉంది. కూటమి ప్రభుత్వం చాలా చురుకుగా పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రజల మనసులు గెలుచుకునే ప్రయత్నం చేస్తోంది. వచ్చే ఎన్నికల వరకు, ఆ తర్వాత కూడా ఇలాగే ఐకమత్యంగా పనిచేస్తే వాటికి తిరుగే ఉండదు.




