పూర్తి స్పష్టతతో నవంబర్‌లో పూర్తిస్థాయి బడ్జెట్‌… గుడ్!

cm cbn AP Budget

ఏపీలో ఎన్నికల దృష్ట్యా జగన్‌ ప్రభుత్వం ఫిబ్రవరిలో ఓటాన్ బడ్జెట్‌ ప్రవేశపెట్టగా, జూన్‌లో అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని కాస్త చక్కదిద్దిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టడం మంచిదనే ఉద్దేశ్యంతో మరోసారి ఓటాన్ అకౌంట్ ద్వారా ఆగస్ట్ నుంచి నవంబర్‌ వరకు అంటే నాలుగు నెలల కోసం రూ.1,29,972.97 కోట్లతో తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టింది.

కొత్తగా అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం ఎటువంటి ఒత్తిళ్ళకు లొంగకుండా కాస్త సమయం తీసుకొని అన్ని అంశాలపై పూర్తి స్పష్ఠత వచ్చిన తర్వాత నవంబర్‌లో పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతోంది. ఆర్ధిక అంశాలలో తొందరపాటు పనికిరాదు. అలాగే పూర్తి స్పష్టత చాలా అవసరం. కనుక నాలుగు నెలలు సమయం తీసుకొని పూర్తి స్పష్టతతో బడ్జెట్‌ ప్రవేశపెడుతుండటం చాలా మంచి నిర్ణయమే అని చెప్పవచ్చు.

ADVERTISEMENT

కేంద్ర బడ్జెట్‌ నుంచి వివిద పద్దుల క్రింద అందబోతున్న నిధులపై ప్రభుత్వానికి ఇప్పుడు పూర్తి స్పష్ఠత వచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇసుక, మద్యం, పరిశ్రమలు తదితర పాలసీలు ప్రకటించింది. సంక్షేమ పధకాలను ఎప్పటి నుంచి ఏవిదంగా అమలుచేయాలి? వాటితో ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందనే దానిపై కూడా లెక్కలు వచ్చాయి.

ఈ నాలుగు నెలల్లో రాష్ట్ర ఆదాయ వ్యయాలు, అప్పులపై పూర్తి స్పష్ఠత వచ్చింది. నవంబర్‌తో ఓటాన్ అకౌంట్ గడువు కూడా ముగుస్తోంది. కనుక నవంబర్‌ రెండో వారంలో శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించి పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్దం అవుతోంది.

బడ్జెట్‌ విలువ సుమారు రూ.2.90 లక్షల కోట్లు వరకు ఉండవచ్చని సమాచారం. అమరావతి, పోలవరం నిర్మాణాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు అయినప్పటికీ, వాటికి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా సాయపడతానని మాట ఇచ్చినందున బడ్జెట్‌లో ఆ మేరకు నిధులను ఇతర అభివృద్ధి పనులు, పధకాలు, అవసరాలకు వినియోగించుకునే వెసులుబాటు కలిగింది.

ఈసారి బడ్జెట్‌లో ఎన్నికల హామీల అమలులో భాగంగా కొన్ని సంక్షేమ పధకాలు, మౌలిక వసతుల అభివృద్ధి, పోర్టులు, విద్యుత్, పరిశ్రమలు, వైద్య ఆరోగ్య రంగాలకు ఎక్కువ కేటాయింపులు జరిపే అవకాశం కనిపిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories