ఇదివరకు వైసీపీ హయంలో విశాఖలో రెండు రోజులు ‘గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్’ జరిగింది. దానిలో ఏపీకి రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, వాటితో 6 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని కోడి-గుడ్డు కధలు చెప్పారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కానీ 5 ఏళ్ళలో ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు.
ఎందుకంటే అవన్నీ కధలు గనుక! కానీ ఆ సదస్సులో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన కంపెనీలు ఏపీకి రాకపోయినా, ఆ చిత్తు కాగితాలను వైసీపీ ఇప్పుడు చాలా తెలివిగా ఉపయోగించుకుంటోంది.
ఇప్పుడు ఏపీకి ఏ కంపెనీ వచ్చినా వాటిని బయటకు తీసి చూపిస్తూ మా వల్లనే వస్తున్నాయంటూ క్రెడిట్ కోసం ఆరాటపడుతున్నారు. కానీ నాడు సంతకాలు చేసిన కంపెనీలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఎందుకు రాలేదు?అనే ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేరు.
చంద్రబాబు నాయుడు ఏపీ సిఎంగా, నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇద్దరూ పారిశ్రామికవేత్తలు, ఐటి కంపెనీల చుట్టూ తిరుగుతూ ఏపీకి తిరిగి రప్పిస్తున్నారు. ఇప్పటికే రూ.10-15 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులతో పలు కంపెనీలు వచ్చాయి. వాటిలో కొన్నిటికి ప్రధాని మోడీ స్వయంగా శంకుస్థాపనలు చేయగా వాటి నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి.
శుక్ర,శనివారం విశాఖలో రెండు రోజులపాటు సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగబోతోంది. ఈ సదస్సులో దేశంలో ప్రసిద్ధ కంపెనీలతో పాటు, అనేక విదేశీ కంపెనీల ప్రతినిధులు కూడా హాజరు కాబోతున్నారు.
సిఎం చంద్రబాబు నాయుడు ఒకరోజు ముందుగానే అంటే నేడు విశాఖ చేరుకొని బీచ్ రోడ్డులో ఉన్న నోవాటెల్ హోటల్లో ఇండియా-యూరప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈరోజు ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్, తైవాన్ దేశాల ప్రతినిధులతో సిఎం చంద్రబాబు నాయుడు సమావేశమవుతారు.
రేపు జరుగబోయే సీఐఐ భాగస్వామ్య సదస్సుకి ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. ముందుగా వారు ‘ఏపీ పెవిలియన్’ని ప్రారంభించి సదస్సులో పాల్గొంటారు.
ఈ సదస్సులో మరో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరుగబోతున్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా ఓర్వకల్‌లో ఏర్పాటు కాబోతున్న డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలను ఈ సదస్సు నుంచే వర్చువల్‌గా ప్రారంభిస్తారు.
నాడు వైసీపీ హయంలో కూడా ఇలాగే సదస్సు నిర్వహించి ఒప్పందాలు చేసుకున్నారు కదా? దానికీ దీనికీ ఏమిటి తేడా? ఇప్పుడూ ఒప్పందాలే కదా చేసుకుంటారు? అని చాలా మందికి సందేహం కలుగవచ్చు.
కానీ రేపు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసే కంపెనీలతో సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇదివరకు పర్యటనలలోనే ఎక్కడ ఎంత పెట్టుబడితో ప్లాంట్స్, ఐటి కంపెనీలు ఏర్పాటు చేయాలనేవన్నీ ఖరారు అయిపోయాయి. వాటిలో కొన్నిటికి భూకేటాయింపులు కూడా జరిగాయి. మరికొన్ని వివిధ దశలలో ప్రాసెస్ అవుతున్నాయి.
కనుక రేపటి సదస్సు వాటికి కొనసాగింపుగా మిగిలిన లాంచనాలు పూర్తి చేయడానికి, కొత్తగా వస్తున్న కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడానికే అని చెప్పవచ్చు.
మంత్రి నారా లోకేష్ కూడా నేడు విశాఖ చేరుకొని ఏడు పెద్ద ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయబోతున్నారు.






